Liquor Scam Case: ఏడెనిమిది నెలలు నేను జైల్లో ఉంటా.. సీబీఐ విచారణకు ముందు సిసొడియా భారీ బలప్రదర్శన
డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరాగా ఆయన లిక్కర్ స్కామ్‌లో సీబీఐ విచారణకు హాజరయ్యారు. మీ పోరాటాన్ని కొనసాగించండని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఏడెనిమిది నెలలు నేను జైల్లో ఉంటా నా గురించి చింతించకండి అని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరాగా ఆయన లిక్కర్ స్కామ్‌లో సీబీఐ విచారణకు హాజరయ్యారు. మీ పోరాటాన్ని కొనసాగించండని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇంట్లో తన భార్య అనారోగ్యం ఉందని, ఆమెను చూసుకోండని విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఫిబ్రవరి 19న విచారణకు రావాలని సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. కాని, ఢిల్లీ ప్రభుత్వ బడ్జెట్ తయారీలో ఉన్నానని, ఒక వారం గడువు కావాలని సిసోడియా కోరడంతో సీబీఐ అంగీకరించింది.
సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు సిసోడియా రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. మరో వైపు సిసోడియా విచారణ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ వరుస ట్వీట్స్ చేసింది. ఒక్క మనీశ్ సిసోడియాను అరెస్టు చేస్తే సత్యం కోసం పోరాటం చేసేందుకు 100 మంది మనీశ్ సిసోడియాలు వస్తారని ఆప్ ట్వీట్ చేసింది. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాను చూసి బీజేపీ భయపడుతోందని ట్వీట్ చేసింది. మరో వైపు తాము గాంధీ అనుచరులమే కాదు భగత్ సింగ్ వారసులం కూడా అని ప్రకటించింది.
సీబీఐ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని మనీశ్ సిసోడియా ట్వీట్ చేశారు. లక్షలాది మంది చిన్నారుల సహకారం, కోట్లాది మంది దేశపౌరుల ఆశీర్వాదం తనకుందని అన్నారు. దేశం కోసం భగత్ సింగ్ ఉరికంబాన్ని ఎక్కారని, అలాంటిది తప్పుడు ఆరోపణలపై జైలు జీవితం గడపాల్సి వస్తే అది చాలా చిన్న విషయమని మనీశ్ సిసోడియా అన్నారు.
అటు సిసోడియా విచారణ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ భారీ బలప్రదర్శన చేపట్టడంతో దేశ రాజధాని ఢిల్లీలో సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ గత కొన్ని నెలలుగా సీబీఐ దీన్ని విచారిస్తోంది. గతంలోనూ చాలాసార్లు మనీశ్ సిసోడియాను ప్రశ్నించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం




