AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్యాచారం ఆరోపణలు.. లలిత్ మోదీ సోదరుడు అరెస్టు!

ఐపిఎల్ మొదటి చైర్మన్ లలిత్ మోదీ సోదరుడు సమీర్ మోదీని ఢిల్లీ పోలీసులు అత్యాచార ఆరోపణలపై అరెస్టు చేశారు. మోడీకేర్ వ్యవస్థాపకుడైన సమీర్‌పై మాజీ ఉద్యోగి ఫిర్యాదు చేసింది. సమీర్ మోదీ న్యాయవాదులు ఈ ఫిర్యాదు డబ్బు వసూలు ప్రయత్నమని వాదించారు. విమానాశ్రయంలో అరెస్టు చేసిన తర్వాత, కోర్టు ఆయనను ఒకరోజు పోలీసు కస్టడీకి అప్పగించింది.

అత్యాచారం ఆరోపణలు.. లలిత్ మోదీ సోదరుడు అరెస్టు!
Lalit Modi And Sameer Modi
SN Pasha
|

Updated on: Sep 19, 2025 | 5:45 AM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మొదటి ఛైర్‌పర్సన్ లలిత్ మోదీ సోదరుడిని గురువారం ఢిల్లీ పోలీసులు అత్యాచారం ఆరోపణలపై అరెస్టు చేశారు. విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డైరెక్ట్-సెల్లింగ్ కంపెనీ మోడీకేర్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మోదీపై సెప్టెంబర్ 10న గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా మాజీ ఉద్యోగి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో సమీర్ మోదీ 2019 నుండి పదే పదే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదుదారు ఆరోపించారు.

డబ్బు వసూలు చేసే ప్రయత్నం

అయితే ఈ ఎఫ్ఐఆర్ గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా చైర్‌పర్సన్ బినా మోదీ కుమారుడు సమీర్ మోదీ నుండి డబ్బు వసూలు చేయడానికి చేసిన ప్రయత్నం అని సమీర్‌ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ రోజు PS న్యూ ఫ్రెండ్స్ కాలనీ చేసిన LOC అభ్యర్థన మేరకు సమీర్ మోదీని విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. తరువాత అత్యాచారం చేశాడనే తప్పుడు ఆరోపణలపై అతన్ని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా అతన్ని ఒక రోజు పోలీసు కస్టడీకి తరలించారు అని సమీర్ మోదీ న్యాయవాది సిమ్రాన్ సింగ్ అన్నారు.

ఒక మహిళ ఫిర్యాదు ఆధారంగా సెప్టెంబర్ 10, 2025న ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఆమె 2019 నుండి సమీర్ మోదీతో సంబంధం కలిగి ఉందని పేర్కొంది. ఈ ఫిర్యాదు తప్పుడు, కల్పిత వాస్తవాల ఆధారంగా రూపొందించారు. సమీర్ మోదీ నుండి డబ్బు వసూలు చేయాలనే ఉద్దేశ్యంతో ఆరోపణలు చేస్తున్నారు అని సిమ్రాన్ సింగ్ వెల్లడించారు.

పరువు నష్టం కేసులో నిర్దోషిగా విడుదలై..

గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా స్వతంత్ర డైరెక్టర్లు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించిన కొన్ని నెలల తర్వాత సమీర్‌ మోదీ మళ్లీ అరెస్టు అయ్యారు. సమీర్ మోదీ గత సంవత్సరం వరకు గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియాలో డైరెక్టర్‌గా ఉన్నారు. పారిశ్రామికవేత్త తన వ్యాఖ్యల ద్వారా తమ ప్రతిష్టను కళంకం చేశారని ఆరోపిస్తూ నిర్మలా బాగ్రి, లలిత్ భాసిన్, అతుల్ కుమార్‌లు సమీర్ మోదీపై పరువు నష్టం దావా వేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి