కశ్మీర్ పై వాషింగ్టన్ పోస్ట్ విష ప్రచారం.. ‘ పండిట్ల ‘ నిరసన

జమ్మూ కశ్మీర్ పై అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ డైలీ విష ప్రచారం చేస్తోందని ఆ దేశంలోని కశ్మీరీ పండిట్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ పత్రిక కాశ్మీర్ విషయంలో ఏకపక్షంగా, పక్షపాతపూరితంగా వార్తలు ప్రచురిస్తోందని ఆరోపిస్తూ శనివారం వారు పత్రిక కార్యాలయం వద్ద ప్రొటెస్ట్ చేశారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని, ఆంక్షల పేరిట జర్నలిస్టులను వేధిస్తున్నారని, ప్రభుత్వాన్ని విమర్శించేవారి నోళ్లు నొక్కుతున్నారని ఈ పత్రిక లేనిపోని వార్తలు ప్రచురిస్తోందని గ్లోబల్ కాశ్మీర్ పండిట్ […]

కశ్మీర్ పై వాషింగ్టన్ పోస్ట్ విష ప్రచారం.. ' పండిట్ల ' నిరసన

జమ్మూ కశ్మీర్ పై అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ డైలీ విష ప్రచారం చేస్తోందని ఆ దేశంలోని కశ్మీరీ పండిట్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ పత్రిక కాశ్మీర్ విషయంలో ఏకపక్షంగా, పక్షపాతపూరితంగా వార్తలు ప్రచురిస్తోందని ఆరోపిస్తూ శనివారం వారు పత్రిక కార్యాలయం వద్ద ప్రొటెస్ట్ చేశారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని, ఆంక్షల పేరిట జర్నలిస్టులను వేధిస్తున్నారని, ప్రభుత్వాన్ని విమర్శించేవారి నోళ్లు నొక్కుతున్నారని ఈ పత్రిక లేనిపోని వార్తలు ప్రచురిస్తోందని గ్లోబల్ కాశ్మీర్ పండిట్ డయాస్పోరా సంస్థ సభ్యులు దుయ్యబట్టారు. జమ్మూ కశ్మీర్ లో ఇటీవలి పరిణామాలను వాషింగ్టన్ పోస్ట్ డైలీ వక్రంగా చిత్రీకరిస్తోందని వారన్నారు. ఇండియాలో మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 ని, 35 ఎని రద్దు చేసిన అనంతరం ఈ రాష్ట్రంలో హింస, ఉద్రిక్తత పెరిగాయనడం సరి కాదన్నారు. నిజానికి మోదీ సాహసోపేతమైన, చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని కాశ్మీరీ పండిట్లు అభినందిస్తూ.. తన రాతలకు ఈ పత్రిక అపాలజీ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కన్నా ఇప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సంతృప్తికరంగా ఉందన్నారు. కశ్మీర్ వాస్తవాధీన రేఖ వద్ద పాక్ ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘిస్తున్నా నోరెత్తని ఈ పత్రిక కేవలం ఇండియా మీద బురద జల్లడానికే ఇలాంటి వార్తలు ప్రచురిస్తోందని పండిట్లు ఆరోపించారు. ఈ డైలీకి వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే వాషింగ్టన్ పోస్ట్ తన ఆర్టికల్ ని సమర్థించుకుంది. నిజంగానే జమ్మూ కశ్మీర్ లో అనిశ్చిత వాతావరణం ఏర్పడిందని, ముఖ్యంగా విదేశీ జర్నలిస్టులపై లేనిపోని ఆంక్షలను అమలు చేస్తోందని పేర్కొంది. ఆ రాష్ట్రంలోని వాస్తవ సంఘటనలు, తదితర సమాచారాన్ని సేకరించేందుకు వారిని అనుమతించడంలేదని ఆరోపించింది. మేం మా వాదనకు కట్టుబడి ఉన్నాం అని ఈ డైలీ ఎడిటర్ స్పష్టం చేశారు.