Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jog Falls: అయ్యగారు వస్తున్నారు.. ఒక్కసారి వచ్చిపోవమ్మ జలపాతమా.. అధికారుల అత్యుత్సాహంతో చిక్కుల్లో గవర్నర్!

ఉన్నతాధికారుల మెప్పు కోసం సాధారణ ప్రజా వనరుల దుర్వినియోగం మన దేశంలో సర్వసాధారణం. నాయకుల విలాసాలకు, అట్టహాసాలు ఇలా అనేక ఖర్చులతో ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున తూట్లు పొడుస్తుంటారు.

Jog Falls: అయ్యగారు వస్తున్నారు.. ఒక్కసారి వచ్చిపోవమ్మ జలపాతమా.. అధికారుల అత్యుత్సాహంతో చిక్కుల్లో గవర్నర్!
Governor Thawarchand Gehlot
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 27, 2021 | 12:04 PM

Karnataka dam Jog waterfalls: ఉన్నతాధికారుల మెప్పు కోసం సాధారణ ప్రజా వనరుల దుర్వినియోగం మన దేశంలో సర్వసాధారణం. నాయకుల విలాసాలకు, అట్టహాసాలు, ఆడంబరాలు, వ్యక్తిగత సిబ్బంది, టూర్లు, వాహనాలు ఇలా అనేక ఖర్చులతో ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున తూట్లు పొడుస్తుంటారు. అంతెందుకు భోజనం చేసే ప్లేట్లు, చాయ్ తాగే కప్పులు, చివరికి మూతిని తుడుచుకునే చిన్న తువ్వాళ్లు వరకు ప్రజల సొమ్ము నుంచే అధికారికంగా దర్జాగా ఖర్చు చేస్తుంటారు. వీటిని సమకూర్చేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖ స్టాప్‌కు చుక్కలే కనిపిస్తుంటాయి. తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ ఘటన సంచలనంగా మారింది. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది.

ప్రభుత్వ యాజమాన్యంలోని కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సిబ్బంది గురువారం ప్రదర్శించిన అత్యుత్సాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. నవంబర్ 25న కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ పర్యటన కోసం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని జోగ్ ఫాల్స్‌కు లింగనమక్కి రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేశారు కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు ప్రఖ్యాత జోగ్ జలపాతాన్ని వీక్షించేందుకు నాలుగు గంటల పాటు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే అకస్మాత్తుగా నీటి విడుదల కారణంగా దిగువ గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉన్నతాధికారుల నుండి అనుమతి తీసుకోకుండా, శరావతి నది దిగువన ఉన్న నివాసితులకు సమాచారం ఇవ్వకుండా నీటిని విడుదల చేయాలని సీనియర్ KPCL అధికారులు ఆదేశించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

బుధవారం శివమొగ్గ వచ్చిన గవర్నర్ గెహ్లాట్ నగరంలో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తరువాత, అతను జోగ్ ఫాల్స్‌కు వెళ్లి, జలపాతం సమీపంలోని బొంబాయి గెస్ట్ హౌస్‌లో రాత్రి బస చేశారు. గురువారం ఉదయం ఆయన జోగ్ జలపాతాన్ని సందర్శించి 830 అడుగులకుపైగా ఎత్తు నుంచి జలపాతాన్ని వీక్షించారు. జలపాతం అందాలను ఆస్వాదిస్తూ కాసేపు గడిపిన అనంతరం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు, కేపీటీసీఎల్ అధికారులు గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో లింగనమక్కి డ్యాం నుంచి 200 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేసినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. అయితే జలపాతం వద్దకు నీరు చేరేందుకు మూడు గంటల సమయం పడుతుంది. అధికారులు అనుకున్నదే తడవుగా జలపాతానికి అప్పటికప్పుడు కాస్త జలకళను తెచ్చిపెట్టారు. కొన్ని నిమిషాల పాటు అహ్లాదకర వాతావరణాన్ని అస్వాదించిన గవర్నర్ ఫోటోలు కూడా దిగారు. అలా ఆయన వెళ్లిపోగానే తిరిగి నీటి విడుదలను ఆపేశారు అధికారులు.

మరోవైపు, ఊహించని రీతిలో నీరు విడుదల కావడం స్థానికుల్లో కలకలం రేపింది. అదనపు నీటిని విడుదల చేస్తే అధికారులు ముందుగా ప్రజలను అప్రమత్తం చేయాలని కార్గల్ మారాలూరు, అంబుగలలే వాసులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శరావతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ (సివిల్) లింగనమక్కి దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. అయితే, నాలుగైదు గంటలపాటు వృథా చేసిన ఆ నీటి వల్ల వేల యూనిట్ల కరెంటును నష్టపోవల్సి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలే కరెంటు కొరత ఉన్న రోజుల్లో, అత్యంత చౌక కరెంటును కూడా కాదనుకుని, అర్జెంటుగా-కృత్రిమంగా ప్రకృతి దృశ్యాన్ని మార్చాలా.. ఒక వ్యక్తి కోసం..? అంటూ నెటిజన్లు సైతం దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, రిజర్వాయర్ నుండి విడుదల చేసిన నీటిని ఉపయోగించి 2,000 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని ప్రభుత్వ అధికారి ఒకరు అంగీకరించారు.

Read Also….  Special Place: నదులు కలిసిన చోట మన దేశం.. ఇది గ్రాఫిక్ మాయ కాదు.. నిజమైన ప్రదేశమే.. ఇంత అందమైన ప్రాంతం ఎక్కడుందంటే..