Rajasthan Political Crisis: రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభం.. అశోక్ గెహ్లాట్‌తో సీనియర్ నేత కమల్‌నాథ్ దౌత్యం
Rajasthan Political Crisis: రాజస్థాన్‌లో సీఎం మార్పు ప్రతిపాదన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజస్థాన్ తదుపరి సీఎంగా సచిన్ పైలట్‌ను నియమించే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడం తెలిసిందే.

Rajasthan Political Crisis: రాజస్థాన్‌లో సీఎం మార్పు ప్రతిపాదన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజస్థాన్ తదుపరి సీఎంగా సచిన్ పైలట్‌ను నియమించే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడం తెలిసిందే. రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అధిష్టానం పిలుపు మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎంకమల్‌నాథ్ హస్తినకు చేరుకున్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. రాజస్థాన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. సంక్షోభ నివారణ కోసం పార్టీ అధిష్టాన దూతగా అశోక్ గెహ్లాట్‌తో కమల్‌నాథ్ దౌత్యం నెరపనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ కాంగ్రెస్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వర్గాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ఆయన ప్రయత్నించనున్నారు. ఇరు వర్గాల నేతలతో మంతనాల అనంతరం రాజస్థాన్ పరిస్థితిని సోనియా గాంధీకి నివేదించనున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో ప్రతినిథులతో మాట్లాడిన కమల్‌నాథ్.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసే యోచన తనకు లేదని కమల్ నాథ్ స్పష్టంచేశారు. నవరాత్రి వేడుకల కోసం తాను ఢిల్లీ వచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయబోనని ఆ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కూడా స్పష్టంచేశారు. దీంతో అధ్యక్ష ఎన్నికల బరిలో ఎవరెవరు నిలుస్తారన్న అంశం ఆసక్తికరంగా మారుతోంది.
అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పోటీలో ఉంటారా?




తాజా పరిణామాల నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల బరిలో అశోక్ గెహ్లాట్ నిలుస్తారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభాన్ని సృష్టిస్తున్న ఆయన్ను.. అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పించాలని కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీ హైకమాండ్‌కు సూచిస్తున్నారు. గెహ్లాట్ విశ్వసనీయుడు కాదని.. ఆయన స్థానంలో గాంధీ కుటుంబానికి విధేయుడైన మరో వ్యక్తిని అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని సీడబ్ల్యూసీ సభ్యులు కొందరు సోనియా గాంధీకి సూచించినట్లు తెలుస్తోంది. అశోక్ గెహ్లాట్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే.. చివరకు పశ్చాత్తాప పడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఓ దశలో అశోక్ గెహ్లాట్‌కు బదులుగా కమల్ నాథ్‌కు పార్టీ అధ్యక్ష అవకాశం కల్పించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన.. సోనియాతో భేటీ కావడం.. పార్టీ అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని స్పష్టంచేయడం ఆసక్తికరంగా మారింది.

Sachin Pilot, Ashok Gehlot
రాజస్థాన్ పరిణామాలపై సోనియా అసంతృప్తి..
అటు రాజస్థాన్ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితుల పట్ల సోనియా గాంధీ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జైపూర్ పరిణామాలను పార్టీ పరిశీలకులు మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్.. సోనియా గాంధీకి వివరించారు. మరీ ముఖ్యంగా అశోక్ గెహ్లాట్ వ్యవహార తీరు పట్ల సోనియా గాంధీ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పార్టీలో ధిక్కార ధోరణి సరికాదని.. అవసరమైతే దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సోనియా గాంధీ ఆదేశించినట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి