Annamalai: తమిళనాడు బీజేపీకి బిగ్ షాక్.. అన్నామలై రాజీనామా.. త్వరలోనే కొత్త..
ద్రవిడ గడ్డపై కమలం పార్టీకి సరికొత్త ఊపు తెచ్చిన ఫైర్‌బ్రాండ్ అన్నామలై తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అమిత్ షాతో కీలక భేటీ అనంతరం ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి అధిష్టానం కూడా వెంటనే ఆమోద ముద్ర వేసింది. పొత్తుల గొడవలు, టికెట్ నిరాకరణ, సీనియర్లతో విభేదాల నేపథ్యంలో కమలాన్ని వీడిన ఈ మాజీ ఐపీఎస్ అధికారి.. దారెటు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తమిళనాడు బీజేపీ ఫైర్‌బ్రాండ్, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ద్రవిడ రాజకీయాల కోటలో బీజేపీకి కొత్త ఊపు తెచ్చిన యువ నాయకుడి సంచలన నిర్ణయం ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఆయన రాజీనామాకు అధిష్టానం సైతం ఆమోదం తెలిపింది. కర్ణాటక కేడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై.. పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పార్టీ అధిష్టానం ఆయనపై నమ్మకంతో అతి తక్కువ కాలంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది.
సాంప్రదాయ ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలకు వ్యతిరేకంగా అన్నామలై తీవ్రస్థాయిలో పోరాటం చేశారు. ముఖ్యంగా ఆయన చేపట్టిన ఎన్ మన్, ఎన్ మక్కల్ (నా భూమి, నా ప్రజలు) పాదయాత్ర తమిళనాడులో బీజేపీ క్యాడర్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. అధికార డీఎంకే అవినీతిపై డీఎంకే ఫైల్స్ పేరుతో ఆయన చేసిన ఆరోపణలు, ప్రెస్ మీట్‌లలో ఆయన చూపించిన అగ్రెసివ్ వైఖరితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకున్నా.. బీజేపీ హైకమాండ్ మాత్రం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. అంతేకాకుండా పళనస్వామి డిమాండ్ మేరకు అన్నామలైకు టికెట్ ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి మూడో స్థానానికే పరిమితమైంది. తమిళనాడు బీజేపీలోని పాత తరం సీనియర్ నేతలకు, అన్నామలై పనితీరుకు అస్సలు పడటం లేదనే టాక్ చాలా కాలంగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన బీజేపీకి రాజీనామా చేశారు.
రాజీనామాకు ముందు అన్నామలైతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు కీలక విషయాలు చర్చించిన తర్వాతే అన్నామలై పార్టీకి రిజైన్ చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో కొత్త పార్టీ పెట్టే యోచనలో అన్నామలై ఉన్నారు. గతంలో డీఎంకే అవినీతిని ఎండగట్టిన ఆయన.. ప్రస్తుతం ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తున్నారు. బీజేపీలో ఉంటే అవన్నీ సాధ్యం కాదనే కారణంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఏదిఏమైన అన్నామలై బీజేపీని వీడడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు.
