AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఏ కూతురు తల్లిదండ్రులకు భారం కాదు’ ఘనంగా కుమార్తెకు విడాకుల ఊరేగింపు నిర్వహించిన తండ్రి

జార్ఖండ్‌లోని రాంచీలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అత్తరింట్లో కష్టాను అనుభవిస్తోన్న కూతురుని కాపాడేందుకు ఓ తండ్రి వినూత్నంగా ఆలోచించాడు. ఆమె పెళ్లిని రద్దు చేయించి, విడాకులకు అప్లై చేయించి.. మేళ తాళాలతో, బాణసంచాతో పెళ్లి ఊరేగింపును తలపించేలా అంగరంగ వైభవంగా పుట్టింటికి తీసుకువచ్చాడు. ఈ సంఘటన స్థానికంగా చర్చణీయాంశంగా మారింది. ఈ ఊరేగింపు తన కూతురు అత్తమామలకు వీడ్కోలు పలికేందుకు కాదని, వారు పెడుతోన్న చిత్రహింసల నుంచి..

'ఏ కూతురు తల్లిదండ్రులకు భారం కాదు' ఘనంగా కుమార్తెకు విడాకుల ఊరేగింపు నిర్వహించిన తండ్రి
Jharkhand Man Takes Out His Married Daughter Back
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 18, 2023 | 2:57 PM

జార్ఖండ్‌, అక్టోబర్‌ 18: జార్ఖండ్‌లోని రాంచీలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అత్తరింట్లో కష్టాను అనుభవిస్తోన్న కూతురుని కాపాడేందుకు ఓ తండ్రి వినూత్నంగా ఆలోచించాడు. ఆమె పెళ్లిని రద్దు చేయించి, విడాకులకు అప్లై చేయించి.. మేళ తాళాలతో, బాణసంచాతో పెళ్లి ఊరేగింపును తలపించేలా అంగరంగ వైభవంగా పుట్టింటికి తీసుకువచ్చాడు. ఈ సంఘటన స్థానికంగా చర్చణీయాంశంగా మారింది. ఈ ఊరేగింపు తన కూతురు అత్తమామలకు వీడ్కోలు పలికేందుకు కాదని, వారు పెడుతోన్న చిత్రహింసల నుంచి ఆమెను విడిపించేందుకేనని చెప్పుకొచ్చాడు. వివరాల్లోకెళ్తే..

రాంచీలోని కైలాష్ నగర్‌లోని కుమ్‌హర్తోలిలో నివాసం ఉంటోన్న ప్రేమ్ గుప్తా, తన కుమార్తె సాక్షి గుప్తాను రాంచీలోని సర్వేశ్వరి నగర్‌కి చెందిన సచిన్ కుమార్ అనే యువకుడితో ఏప్రిల్ 28, 2022 ఎంతో వైభవంగా వివాహం జరిపించాడు. సచిన్ కుమార్ జార్ఖండ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే కూతురు అత్తారింట్లో భద్రంగా ఉంటుందని భావించిన ఆ తండ్రికి నిరాశ ఎదురైంది. అల్లుడు పరమ దుర్మార్గుడు. దీంతో పెళ్లి జరిగిన కొన్ని రోజుల్లోనే కూతురిని ఆమె భర్త, అత్తమామలు వేధించడం ప్రారంభించారు. భర్త సచిన్‌ కుమార్‌ ఆమె కొట్టి కొన్నిసార్లు ఇంటి నుంచి బయటకు గెంటేసేవాడు కూడా.

నిజానికి సాక్షి గుప్తాను వివాహం చేసుకున్న సచిన్ కుమార్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లయ్యి అవి పెటాకులయ్యాయి. ఈ విషయం వివాహం జరిగిన ఏడాది తర్వాత సాక్షికి తెలిసింది. దీంతో ఆమె కాళ్ల కింద నేల ఒక్కసారిగా కంపించింది. అన్నీ తెలిసినా ధైర్యం కోల్పోకుండా ఎలాగోలా బంధాన్ని కాపాడుకోవాలని ఆమె సర్వశక్తులా ప్రయత్నించింది. కానీ, నిత్యం వేధింపుల కారణంగా అతనితో కలిసి జీవించడం కష్టమని భావించిన ఆమె, అతని చెర నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది. తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అందుకు అంగీకరించారు. దీంతో సాక్షి తండ్రి ప్రేమ్‌ గుప్తా తన కూతురిని అత్తమామల ఇంటి నుంచి బ్యాండ్‌-బాజాలు, బాణసంచాతో ఊరేగింపుగా తిరిగి తన ఇంటికి తీసుకువచ్చాడు.

ఇవి కూడా చదవండి

తన కూతురికి వేదింపుల నుంచి నుంచి విముక్తి లభించిందన్న ఆనందంతోనే ఇలా చేశానని ప్రేమ్ గుప్తా చెబుతున్నాడు. అక్టోబర్ 15న జరిగిన ఈ విడాకుల ఊరేగింపుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసి, మంచి వ్యక్తిని చూపి ఆడంబరంగా వివాహం చేస్తుంటారు. అయితే ఒక్కోసారి కూతుళ్లకు జీవిత భాగస్వామిని ఎంపిక చేయడంతో తల్లిదండ్రులు తప్పటడుగులు వేస్తుంటారు. ఒకవేళ ఎవరి విషయంలోనైనా ఇలా తప్పుగా జీవితభాగస్వామిని ఎంపిక చేసి ఉంటే మీ కుమార్తెను గౌరవంగా తిరిగి పుట్టింటి తీసుకురావాలి. ఎందుకంటే ఏ కుమార్తె తల్లిదండ్రులకు భారం కాదు. కుమార్తెలు చాలా విలువైనవారు’ అని ఈ వీడియోను పోస్టు చేస్తూ ప్రేమ్ గుప్తా రాసుకొచ్చారు. విడాకుల కోసం సాక్షి కోర్టులో కేసు వేసింది. త్వరలో చట్టపరంగా విడాకులకు ఆమోదం లభించే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.