AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Terrorist Attack: పేల్చేస్తే పోలా..! ఆర్మీనా మజాకా.. టెర్రరిస్టులు, వారి సహాయకుల ఇళ్లను ఏం చేస్తున్నారంటే..

పేల్చేస్తే పోలా.. బాంబులతో లేపేస్తే పోలా.. ఎస్‌.. ఇండియన్‌ ఆర్మీ ఇప్పుడు ఇదే పనిచేస్తోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ముష్కర వేట మరింత ముమ్మరం అవుతోంది. పాక్‌ చర్యలతో సహనం నశించిన భారత ఆర్మీ.. ఉగ్రవాదుల ఇళ్లను బాంబులతో పేల్చేస్తోంది. ఓ వైపు ఉగ్రవాదుల కోసం గాలిస్తూనే.. ఇంకోవైపు టెర్రరిస్టుల ఇళ్లను నేలమట్టం చేస్తోంది. ఇప్పటివరకు 11 మంది ఉగ్రవాదుల ఇళ్లను లేపేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

Pahalgam Terrorist Attack: పేల్చేస్తే పోలా..! ఆర్మీనా మజాకా.. టెర్రరిస్టులు, వారి సహాయకుల ఇళ్లను ఏం చేస్తున్నారంటే..
Indian Army Demolishes Terrorists' Houses
Shaik Madar Saheb
|

Updated on: Apr 27, 2025 | 12:21 PM

Share

జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రదాడులపై ఇండియన్‌ ఆర్మీ కన్నెర్ర చేస్తోంది. కఠిన చర్యలతో ఉక్కుపాదం మోపుతోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టులు, వారి సహాయకులపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన భద్రతా బలగాలు.. తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్తున్నాయి. ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసేలా చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే.. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, వారికి సహకరించేవారి ఇళ్లను నేలమట్టం చేసే ప్రక్రియను నాన్‌స్టాప్‌గా కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేసిన భారత ఆర్మీ దళాలు.. లేటెస్ట్‌గా కుప్వారాలో ఫరూఖ్‌ తీద్వా, బందిపొరాలో జమీల్ గోగ్జ్‌రీ ఇళ్లను.. బాంబులతో పేల్చివేశారు. లష్కర్ -ఏ- తోయిబా సంస్థలో యాక్టివ్‌గా ఉన్న ఫరూఖ్ తీద్వా.. ప్రస్తుతం పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడు. జమ్మూకశ్మీర్‌ షోపియాన్ జిల్లా చోటిపోరాకు చెందిన ఫరూఖ్ తీద్వా.. అలియాస్‌ షాహిద్‌ అహ్మద్‌ గత మూడు, నాలుగేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాడు. పాక్ ఆర్మీతో కలిసి అమాయకుల ప్రాణాలు తీస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

11 మంది ఉగ్రవాదుల ఇళ్లు నేలమట్టం.. ఈ నెల 23 నుంచి ఉగ్రవాదుల కోసం జల్లెడ

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవేటను భద్రతా దళాలు ముమ్మరం చేశాయి. ఉగ్రదాడి తర్వాత రోజు నుంచే రంగంలోకి దిగిన ఆర్మీ… ఉగ్రవాదుల ఇళ్లను ఒక్కొక్కటిగా బాంబులు పెట్టి లేపేస్తోంది. మొన్న 24న ఆసిఫ్‌ ఇంటిని కూడా ఇదే రేంజ్‌లో పేల్చేశాయి. ఇలా ఇప్పటికే 11 మంది ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేశాయి. భారీ బాంబులు, జేసీబీలతో లేపేసింది. ఇప్పటివరకు 11 మంది ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిల్ అహ్మద్ థోకర్, అహ్సాన్ ఉల్ హక్ షేక్, ఆసిఫ్ అహ్మద్ షేక్, షాహిద్ అహ్మద్ కుట్టే, జాహిద్ అహ్మద్ గనీ, ఫరూఖ్ అహ్మద్ తెద్వా, అద్నాన్ షఫీ దార్, అమీర్ అహ్మద్ దార్, జమీల్ అహ్మద్ షేర్ గోజ్రీ, అమీర్ నజీర్, జమెల్ గోగ్జ్రీ ఇళ్లు ఉన్నాయి.

ఈ నెల 22న పహల్గామ్‌లో ఉగ్రదాడి జరగ్గా.. 23 నుంచి ఉగ్రవాదుల కోసం జల్లెడ మొదలైంది. ఆ మర్నాడు నుంచి దొరికినవాళ్ల ఇళ్లు దొరికినట్లు ఇండియన్ ఆర్మీ పేల్చేస్తోంది. షోపియాన్‌లోని చోటిపొరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండల్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా దళాలు కూల్చేశాయి. అలాగే.. కుల్గాంలోని మతాలం ప్రాంతంలో మరో టెర్రరిస్ట్‌ జాకీద్ అహ్మద్‌ ఇంటిని ధ్వంసం చేశాయి. ఇదే జిల్లాలో లష్కరేకు చెందిన మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని పేల్చేశాయి. కుల్గాంలోని ముర్రాన్ ప్రాంతంలో అహ్సన్ ఉల్‌ హక్‌ ఇంటిని బాంబులతో నేలమట్టం చేసిపడేశాయి. పుల్వామాలోని కాచిపొరాలో హరీస్ అహ్మద్‌ అనే టెర్రరిస్ట్‌ అలాగే.. బందిపొరాలో జమీల్ గోగ్జ్‌రీ ఇంటిని భద్రతా బలగాలు బాంబులతో కూలగొట్టాయి.

మొత్తంగా.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, వారి కుటుంబాలకు.. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేవారిని నిరోధించేందుకు హెచ్చరికగా ఇండియన్‌ ఆర్మీ కఠిన చర్యలు చేపట్టింది. దీని ద్వారా ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నాశనం చేయడంతో పాటు, భవిష్యత్తులోనూ ఇలాంటి ఉగ్ర దాడులు జరగకుండా ఉక్కుపాదం మోపుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..