నా భర్తకు ఆ హోదా ఇవ్వండి చాలు..! పహల్గామ్ ఉగ్రదాడి బాధితురాలి డిమాండ్
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన కాన్పూర్ వ్యాపారవేత్త శుభమ్ ద్వివేదికి అమరవీరుడు హోదా ఇవ్వాలని ఆయన భార్య అశాన్య డిమాండ్ చేశారు. శుభమ్ హిందువు అని గర్వంగా చెప్పుకుని ప్రాణత్యాగం చేశారని ఆమె తెలిపారు. శుభమ్ తండ్రి భద్రతా లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నెల 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో మొత్తం 26 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మరణించిన వారిలో కాన్పూర్‌కు చెందిన వ్యాపారవేత్త శుభమ్ ద్వివేది ఒకరు. అయితే.. తాజాగా ఆమె భార్య తన భర్తకు అమరవీరుడి హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా అయితే నేను జీవించడానికి ఒక అర్థం ఉంటుందని ఆమె అన్నారు. ఇతరులను రక్షించడానికి తన ప్రాణాలను త్యాగం చేసినందుకు తన భర్తకు అమరవీరుడు హోదా ఇవ్వాలని కోరారు. ఆయన హిందువు అని గర్వంగా చెప్పుకొని మరీ ప్రాణ త్యాగం చేశారు అని మృతుడు శుభమ్ భార్య అశాన్య శనివారం వెల్లడించారు.
31 ఏళ్ల శుభం రెండు నెలల క్రితం అంటే ఫిబ్రవరి 12న అశాన్యను వివాహం చేసుకున్నారు. భార్యతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లి ఏప్రిల్ 22న ఉగ్ర దాడిలో మరణించారు. గురువారం కాన్పూర్ సమీపంలోని అతని స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. కాగా దాడికి ముందు క్షణాలను గుర్తుచేసుకుంటూ మొదటి బుల్లెట్ నా భర్తను తాకింది. ఉగ్రవాదులు మేం హిందువులా లేదా ముస్లింలా అని అడిగారు. దాంతో చాలా మంది పరిగెత్తి తమ ప్రాణాలను కాపాడుకోగలిగారు అని అశాన్య చెప్పారు.
వారు మా దగ్గరకు వచ్చి మీరు హిందువులా? ముస్లింలా? అని అడిగారు. వారు తమాషా చేస్తున్నారని నేను అనుకున్నాను. నేను వెనక్కి తిరిగి, నవ్వి, ఏంటి అని అడిగాను, కానీ వారు మళ్ళీ అదే ప్రశ్నను అడిగారు. మేం హిందువులమని నేను సమాధానం చెప్పగానే, కాల్పులు జరిపారు. అంతే శుభమ్ ముఖం రక్తంతో తడిసిపోయింది. ఏమి జరిగిందో నాకు అర్థం కాలేదు అని అశాన్య భావోద్వేగానికి గురయ్యారు. ఈ దాడికి పాల్పడిన వారిని కాల్చి చంపాలని అశాన్య డిమాండ్ చేశారు. కాగా, శుభమ్ తండ్రి సంజయ్ ద్వివేది సంఘటన స్థలంలో భద్రత లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి జరిగిన దాదాపు గంట తర్వాత ఆర్మీ సిబ్బంది వచ్చి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
