పహల్గామ్ ఉగ్రదాడిపై విచారణ మొదలుపెట్టిన NIA.. తొలుత ఎవరిని ప్రశ్నిస్తున్నారంటే..?
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు ప్రారంభించింది. NIA అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు, సాక్షులను విచారిస్తున్నారు. ఉగ్రవాదుల కదలికలను పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు NIA ఈ కేసును స్వీకరించింది.

26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారికంగా చేపట్టిందని అధికారులు ఆదివారం తెలిపారు. ఇటీవలి కాలంలో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రవాద సంఘటనలలో ఒకదానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని పునర్నిర్మించడానికి NIA నుండి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని బృందం ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తోంది.
మంగళవారం దాడి జరిగిన పహల్గామ్‌లోని బైసరన్ లోయ చుట్టూ ఉన్న ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను దర్యాప్తు అధికారులు వివరంగా పరిశీలిస్తున్నారు. అలాగే అక్కడి నుంచి ఎవరెవరు వెళ్లారనేది కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఉగ్రవాదుల కదలికల సరళి, కార్యాచరణ వ్యూహాలను గుర్తించడం దీని లక్ష్యం అని అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు, సాంకేతిక బృందాల మద్దతుతో, NIA ఆ ప్రాంతంలో సమగ్ర శోధన నిర్వహిస్తోంది. ఆధారాలను సేకరించి దాడి వెనుక ఉన్న విస్తృత కుట్రను వెలికితీస్తోంది. NIA బృందాలు బుధవారం నుండి సంఘటనా స్థలంలో మోహరించి కీలకమైన ఆధారాలను కనుగొనే ప్రయత్నాలను ముమ్మరం చేశాయని అధికారులు తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆదేశాల మేరకు ఏజెన్సీ ఈ కేసును చేపట్టింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
