టెన్షన్.. టెన్షన్.. ఇండియాలో 107 మంది పాకిస్తాన్ పౌరులు మిస్సింగ్! ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో?
జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాద దాడి తరువాత, భారత ప్రభుత్వం పాకిస్థానీల వీసాలను రద్దు చేసింది. మహారాష్ట్రలో 5023 మంది పాకిస్థానీలు నివసిస్తున్నారని, వారిలో 250 మందిని బహిష్కరించారని అధికారులు తెలిపారు. కానీ 107 మంది పాకిస్థానీల ఆచూకీ తెలియదు. మరో 34 మంది అక్రమంగా నివసిస్తున్నారు.

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయుల వీసాలను రద్దు చేసి, వారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించిన విషయం తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదంపై విస్తృత అణచివేతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం.. లాంగ్ టర్మ్ వీసాలు, రెన్యూవల్ వీసాలు, పౌరసత్వ దరఖాస్తుదారులు, భారతీయ పౌరులను వివాహం చేసుకున్న వారితో సహా మొత్తం 5,023 మంది పాకిస్తానీ జాతీయులు ప్రస్తుతం మహారాష్ట్రలో నివసిస్తున్నారని అధికారులు తెలిపారు.
అయితే వారిలో 250 మందిని వెనక్కి పంపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. షార్ట్ టర్మ్ వీసాలపై ఉన్న పాకిస్తానీ జాతీయులను దేశం నుండి బహిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మహారాష్ట్రలో దాదాపు 250 మంది షార్ట్ టర్మ్ వీసాలపై ఉన్నట్లు గుర్తించామని, వారిని తిరిగి పంపించే ప్రక్రియ ప్రారంభించామని అధికారులు తెలిపారు.
107 మంది ఆచూకీ లేదు..
ఆందోళన కలిగించే ఒక విషయం ఏమిటంటే.. 107 మంది పాకిస్తానీయులు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. వారు ఇండియాలోకి ప్రవేశించిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారా? లేదా అందుబాటులో లేకుండా పోయారా అయేది తెలియడం లేదు. అదనంగా 34 మంది పాకిస్తానీలు చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా మహారాష్ట్రలో అక్రమంగా నివసిస్తున్నారు. మహారాష్ట్ర పోలీసులు, కేంద్ర సంస్థల సమన్వయంతో, ఇప్పుడు లెక్కల్లో కనిపించని పాకిస్తానీ జాతీయులను గుర్తించడం, బహిష్కరణ ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి సారించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




