AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మంచు కురిసే వేళలో.. జమ్మూ, హిమాచల్ అందాలను చూస్తే మీరే మైమరిచిపోతారు.. వీడియో

జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లను మంచు దుప్పటి కమ్మేసింది. అక్కడి ప్రాంతాలన్నీ మంచువర్షంతో తడిసిముద్దవుతున్నాయి. శ్వేత వర్ణంలో మెరిసిపోతూ పర్యాటకుల మనసు దోచేస్తున్నాయి.

Watch: మంచు కురిసే వేళలో.. జమ్మూ, హిమాచల్ అందాలను చూస్తే మీరే మైమరిచిపోతారు.. వీడియో
Himachal Pradesh
Shaik Madar Saheb
| Edited By: Subhash Goud|

Updated on: Nov 15, 2022 | 6:56 AM

Share

హిమాలయ పర్వత శ్రేణిని మంచు కప్పేసింది. జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో జోరుగా మంచువర్షం కురుస్తోంది.. కశ్మీర్‌ లోని గుల్‌మార్గ్‌ , మొఘల్‌ రోడ్డు , పిర్‌పంజిల్‌ ప్రాంతాల్లో భారీగా హిమపాతం నమోదైంది. దోడా జిల్లాలో జోరుగా మంచు పడుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. హిమాచల్‌ప్రదేశ్‌ లోని లాహుల్‌ స్పుతిలో రికార్డు స్థాయిలో మంచువర్షం కురుస్తోంది. రోడ్లపై మంచుదుప్పటి కమ్మేయడంతో చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షంలా పడుతున్న మంచు ధాటికి జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇక హిమాలయ పర్వత ప్రాంతమైన లద్దాఖ్‌ను మంచు పలకరించింది. లేహ్‌లో మంచువర్షంతో అక్కడి పరిసరాలు అహ్లాదకరంగా మారిపోయాయి.

మంచుతో కొత్త అందాలను సంతరించుకున్నాయి కొండ ప్రాంతాలు. శ్వేతవర్ణంలో మెరిసిపోతున్నాయి. పాల నురగల్లాంటి అక్కడి మంచు అందాలు పర్యాటకుల మనసును దోచేస్తున్నాయి. ఎటుచూసినా మంచు కనువిందు చేస్తోంది. చెట్లు, ఇళ్లు, వాహనాలు, రోడ్లు ఇలా అన్నింటినీ కప్పేసింది మంచు.

ఇవి కూడా చదవండి

లద్దాఖ్‌లోని ద్రాస్‌, లేహ్‌లో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఆ ప్రాంతాలన్నీ మంచుతో నిండిపోవడంతో స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. మంచు చరియలు విరిగిపడే ప్రమాదముందని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మంచు కారణంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు అధికారులు. ఇక కొన్ని ప్రాంతాల్లో దట్టంగా కురుస్తున్న మంచు స్థానికులను గజగజ వణికిస్తున్నప్పటికీ.. టూరిస్టులకు మాత్రం ఆహ్లాదాన్ని పంచుతోంది. అక్కడి లోయల అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

శీతాకాలం ప్రారంభమవ్వడంతో ఈ ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు పలు రాష్ట్రాల ప్రజలు జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు చేరుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..