India Gate: ‘ఇండియా గేట్’ ఎందుకు కట్టారో తెలుసా..?.. దీని చరిత్ర ఏమిటి..?.. ఎన్నో ఆసక్తికర విషయాలు
India Gate: న్యూఢిల్లీ ఇండియా గేట్. భారతదేశ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. ఇది దేశ రాజధాని అయిన న్యూ ఢిల్లీలో ఉంది. రాష్ట్రపతి భవన్‌కు కూతవేటు దూరంలో ఇండియా గేట్..
► కట్టడం: ఇండియా గేట్ ► నిర్మాణం: 1921 – 1931 ► ఎక్కడ: ఢిల్లీ
India Gate: న్యూఢిల్లీ ఇండియా గేట్. భారతదేశ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. ఇది దేశ రాజధాని అయిన న్యూ ఢిల్లీలో ఉంది. రాష్ట్రపతి భవన్‌కు కూతవేటు దూరంలో ఇండియా గేట్ ఉన్నది. న్యూ ఢిల్లీలో చూడవలసిన అతి కొద్ది పర్యాటక స్థలాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. దీనిని మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో అమరులైన 90 వేల మంది జవాన్ల జ్ఞాపకార్థం ఈ స్మృతి చిహ్నాన్ని కట్టించారు. ఇది ఒక అపురూప కట్టడం. దీని ఎత్తు 42 మీటర్లు. ఈ కట్టడం భరత్‌పూర్ నుంచి తెప్పించిన ఎర్రరాయితో కట్టించారు. 1971వ సంవత్సరం నుంచి ఇక్కడ అమర్ జవాన్ జ్యోతి కూడా వెలుగుతోంది. ఇండియా గేట్ పరిసరాలు చూడటానికి ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. పరిసరాలలో పచ్చిక బయళ్ళు, చిన్నారులు ఆడుకోవడానికి సుందరమైన పార్కు, బోట్ క్లబ్ ఉండటమే కాకుండా ఇక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ చూడడం మరుపురాని అనుభూతినిస్తుంది.
ఇండియా గేట్ – చరిత్ర:
అది మొదటి ప్రపంచ యుద్ధ కాలం. క్రీ.శ1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 80 వేల భారత, బ్రిటీష్ జవానులు అమరులైనారు. ఆ తరువాత జరిగిన అఫ్ఘన్ యుద్ధంలో కూడా 10 వేల వరకు జవానులు ప్రాణాలర్పించారు. దీంతో అక్కడ ఒక అపురూపకట్టడం ఉండాలనే ఆలోచనే ఈ కట్టడానికి ప్రాణం పోసింది. వాటిపై యుద్ధంలో మరణించిన అమరజవానుల పేర్లు కూడా లిఖించబడ్డాయి. ఢిల్లీలో అనేక కట్టడాలకు రూపకల్పన చేసిన ఎడ్విన్ ల్యుటెన్స్ ఈ కట్టడానికి కూడా రూపకల్పన చేశాడు. క్రీ.శ. 1921, ఫిబ్రవరి 10న డ్యూక్ ఆఫ్ కన్నాట్‌చే పునాదిరాయి వేయబడి దాదాపు 10 సంవత్సరాల నిర్మాణ సమయం తరువాత 1931లో ఇది పూర్తయింది. దీని ప్రారంభ నామం ‘ఆలిండియా మెమోరియల్ వార్’. ఈ కట్టడపు ఇరువైపులాపై భాగంలో ఇండియా గేట్ అనే పదాలు స్పష్టంగా కనిపించేటట్లు చెక్కబడింది.
అమర్ జవాన్ జ్యోతి:
క్రీ.శ. 1971లో జరిగిన భారత్ -పాక్ యుద్ధం తరువాత ఈ కట్టడం క్రింది భాగాన అమర్ జవాన్ జ్యోతి వెలుగుతోంది. 1971 నాటి యుద్ధంలో అమరులైన భారత జవానులకు కూడా ఇది నివాళులు అర్పిస్తోంది. దీనిని అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించారు. భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, త్రివిధ దళాల అధినేతలు, మంత్రులు, రాజకీయ ప్రముఖులు, భారత అధికారులు, సాధారణ ప్రజలు కూడా అమర్ జవాన్ జ్యోతి వద్ద నివాళులు అర్పించవచ్చు. ప్రతియేటా జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే పరేడ్.. రాష్ట్రపతి భవన్ దగ్గర మొదలై ఇండియా గేట్ నుంచిసాగుతుంది.
నేషనల్ వార్ మెమోరియల్:
జులై 2014 లో భారత ప్రభుత్వం ఇండియా గేట్ వద్ద నేషనల్ వార్ మెమోరియన్‌ను నిర్మించాలని ప్రకటించింది. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలకు గుర్తుగా ఇండియా గేట్ వద్ద ఉన్న ప్రిన్సెస్ పార్క్ పక్కనే 500 కోట్లతో వార్ మెమోరియల్‌ను, మ్యూజియంను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భారత స్వాతంత్య్ర పోరాటంలో సుమారు 22 వేల మంది సైనికులు అమరులయ్యారు. వీరి జ్ఞాపకార్థం ఈ ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నలిచ్చింది కేంద్రం. యుద్ధంలో సైనికుల పోరాటానికి సంబంధించిన మూమెంట్స్, వార్ జరిగిన ప్రాంతాల ఫొటోలు మ్యూజియంలో చూడవచ్చు.
ఇండియా గేట్ ఎలా చేరుకోవాలి ?:
ఢిల్లీలోని బారాఖంబా రోడ్ మెట్రో స్టేషన్‌లో దిగి, అక్కడి నుండి మూడు కోలోమీటర్ల దూరంలో ఉన్న ఇండియా గేట్ వద్దకు టాక్సీ లేదా ఆటోలో ఎక్కితే, 15 నిమిషాలలో గేట్ వద్దకు చేరుకోవచ్చు.
ఇవీ కూడా చదవండి:
Azadi ka Amrut Mahotsav: ‘జన గణ మన’ను జాతీయ గీతంగా ఎప్పుడు స్వీకరించారో తెలుసా..?.. చరిత్ర ఏమిటి..?