మహా రంజుగా ‘మధ్య’ రాజకీయం
నెల రోజులుగా మహారాష్ట్ర రాజకీయాలు దేశ ప్రజలకు ఉత్కంఠ కలిగిస్తుండగా.. తాజాగా మధ్యప్రదేశ్‌లో రాజకీయం మహా రంజుగా మారుతోంది. స్వల్ప మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కమల్‌నాథ్‌కు తాజా పరిణామాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఒకవైపు బిజెపి, ఇంకోవైపు సింధియా రూపంలో ముప్పు ముంచుకు వస్తుండడంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కౌంటర్ వ్యూహానికి ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తెరలేపారు. మొత్తమ్మీద మధ్య ప్రదేశ్ రాజకీయాలు పలు మార్పుల దిశగా పయనిస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో […]
నెల రోజులుగా మహారాష్ట్ర రాజకీయాలు దేశ ప్రజలకు ఉత్కంఠ కలిగిస్తుండగా.. తాజాగా మధ్యప్రదేశ్‌లో రాజకీయం మహా రంజుగా మారుతోంది. స్వల్ప మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కమల్‌నాథ్‌కు తాజా పరిణామాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఒకవైపు బిజెపి, ఇంకోవైపు సింధియా రూపంలో ముప్పు ముంచుకు వస్తుండడంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కౌంటర్ వ్యూహానికి ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తెరలేపారు. మొత్తమ్మీద మధ్య ప్రదేశ్ రాజకీయాలు పలు మార్పుల దిశగా పయనిస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి,
230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 114 మంది సభ్యులను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇద్దరు బిఎస్పీ సభ్యులు, నలుగురు ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బిజెపి 109 మంది సభ్యులతో బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. అయితే.. గత డిసెంబర్‌లో కమల్ నాథ్ ప్రభుత్వం ఏర్పడినప్పట్నించి ఆయన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి ఎత్తుగడలు వేస్తూనే వుంది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తన రాజకీయ అనుభవాన్ని రంగరించి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీలో రగిలిన అసంతృప్తి బిజెపికి అందివచ్చిన అవకాశంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించి భంగపడిన యువ నేత జ్యోతిరాదిత్య సింధియా.. రూపంలో బిజెపికి లక్కు కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. తాను సీఎం కాకుండా అడ్డుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. తాజాగా తాను ఎంపిసిసి అధ్యక్షుడిగా కూడా కాకుండా ఆపారని జ్యోతిరాదిత్య సింధియా కినుక వహించినట్లు సమాచారం. పిసిసి పీఠాన్ని తాను ఆశించగా.. దివంగత ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ తనయుడు అజయ్ సింగ్‌కు డిగ్గీరాజా ఇప్పించారని జ్యోతిరాదిత్య ఆగ్రహంతో వున్నారు. ఈ క్రమంలోనే బిజెపి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిందని సమాచారం.
సింధియా ఆధ్వర్యంలోని కాంగ్రెస్ వర్గం మొత్తం గంపగుత్తగా బిజెపిలో చేరితే ఉప ముఖ్యమంత్రి పదవిని బిజెపి ఆఫర్ చేసినట్లు సమాచారం. దాంతో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ గూడు వీడేందుకు జ్యోతిరాదిత్య సింధియా రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. బిజెపికి ఆల్‌రెడీ 109 మంది ఎమ్మెల్యేలున్నారు.. జ్యోతిరాదిత్యతో కలిసి 30 మంది వస్తే.. 139 మందితో కలిసి బిజెపి అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చు. అయితే.. ఈ కథనాలన్నీ నిజమేనని భావించేలా సింధియా తన సోషల్ మీడియా అకౌంట్లలో తన బయోడేటాను మార్చుకున్నారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో తన పేరు పక్కన గతంలో ‘‘కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ (గుణ), మాజీ కేంద్ర మంత్రి’’ అని బయోడేటా మెన్షన్ చేయగా.. దాన్ని మార్చుకుని తాజాగా ‘‘పబ్లిక్ సర్వెంట్, క్రికెట్ ఎంతూస్యాసిస్ట్’’ గా మార్చుకున్నారు.
ఈ మార్పుల కారణంగా సింధియా ఇక కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పడం ఖాయమన్న కథనాలు మొదలయ్యాయి. అయితే.. తాను నెల రోజుల క్రితమే తన బయోడేటా లెంగ్థీగా వుందని మార్చుకున్నానని, తాను పార్టీ మారతానన్న వార్తలు కేవలం నిరాధారమైనవని జ్యోతిరాదిత్య చెబుతున్నారు. కానీ తెరచాటు మంత్రాంగం వేరే వుందని తెలుస్తోంది. అయితే, సింధియా మాటలను విశ్వసించని ముఖ్యమంత్రి కమల్‌నాథ్.. ఒకవేళ ఆయన తిరుగుబాటు చేసి, పార్టీని చీల్చినా పదవిని కాపాడుకునేందుకు యత్నాలు మొదలుపెట్టారు. కౌంటర్ వ్యూహంతో బిజెపి ఎమ్మెల్యేలను తనవైపునకు లాగేందుకు యత్నాలు ముమ్మరం చేశారు. ఏది ఏమైనా మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి రాగానే మధ్య ప్రదేశ్ పరిణామాలు వేగంగా మారతాయని పరిశీలకులు అంఛనా వేస్తున్నారు.