Telugu News India News India’s first electric double decker bus reaches Mumbai, joins BEST fleet: Watch Video
Viral Video: మహానగరంలో మళ్లీ రోడ్డెక్కిన డబుల్ డెక్కర్ బస్.. వింతగా చూసిన జనం.. వీడియో
ముంబై మహానగరంలో డబుల్ డెక్కర్ బస్ మళ్లీ రోడ్డెక్కింది. దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సును కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు.
Electric double-decker bus: ముంబై మహానగరంలో డబుల్ డెక్కర్ బస్ మళ్లీ రోడ్డెక్కింది. స్విచ్ మొబిలిటీ దేశీయంగా తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సును ముంబైలో తొలి సారిగా ఆవిష్కరించింది. దక్షిణ ముంబైలోని మంత్రాలయ సమీపంలో గురువారం ఉదయం జరిగిన కార్యక్రమంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సును కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడన్వీస్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ బస్సుతో సహా రెండు కొత్త ఎలక్ట్రిక్ బస్సులు బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఆధ్వర్యంలో సేవలందించనున్నాయి. EiV 22 బస్సు నగర రవాణాకు అనువుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ డబుల్ డెక్కర్ ఏసీ బస్సులు యూకే రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. త్వరలోనే భారత్‌లోని ప్రధానగరాల్లో అందుబాటులోకి రానున్నాయి.
యాప్ ఆధారిత ప్రీమియం బస్ సర్వీస్ కోసం సింగిల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సు, డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ బస్సును దక్షిణ ముంబైలోని NCPAలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. నలుపు, ఎరుపు డబుల్ డెక్కర్ బస్సు, బ్లూ కలర్ సింగిల్ డెక్కర్ బస్సు ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హిందుజా గ్రూప్‌నకు చెందిన అశోక్ లే ల్యాండ్ ఎలక్ట్రిక్ విభాగానికి చెందిన స్విచ్ మొబిలిటీ బస్సులను తయారుచేస్తోంది. కాగా.. ఇప్పటికే బృహన్ ముంబయి ఎలక్ట్రిసిటీ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) 200 బస్సులను ఆర్డర్ చేసినట్లు అధికారులు తెలిపారు.
కాగా.. హైదరాబాద్‌లో కూడా డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చేందుకు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. గతేడాది ఈ విషయంపై కేటీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు. హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సులు తీసుకొచ్చే అవకాశం ఏదైనా ఉందా ? అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అడిగారు. ఆబిడ్స్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదువుకొనే సమయంలో డబుల్ డెక్కర్ బస్సులు కనిపించేవని.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.