Pahalgam Terrorist Attack: నాడు భగవద్గీత.. నేడు భారత్‌గీత..! శిక్ష తప్పదు.. శత్రు దేశానికి మాస్ వార్నింగ్..
మహా భారతమే రాబోయే శత్రు సంహారానికి మార్గదర్శనం చేయబోతోందా? శత్రు దేశానికి ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇచ్చిన సంకేతం, సందేశం అదేనా? RSS చీఫ్ మాటల తూటాల మర్మం అదేనా? గీత దాటితే గీతా సందేశం వినిపించాల్సిందే...ఉగ్ర మూకల సంహారం జరగాల్సిందే. అది నాటి భారతం...ఇది నేటి భారత్. అది భగవద్గీత.. ఇది భారతగీత!

మనం నీళ్లిస్తే.. వాళ్లు రక్తం కోరారు. మనం దాహం తీరిస్తే.. వాళ్లు రక్త దాహం తీర్చుకున్నారు. మనం మంచి చేస్తే, వాళ్లు మారణకాండకు తెగబడ్డారు. ఇది ధర్మం వర్సెస్ అధర్మం. ఇది నమ్మకం వర్సెస్ నయవంచన. నాటి భారతంలో అయినా, నేటి భారత్‌లో అయినా…అదే దాయాది పోరు. ఆ భారతంలో శ్రీకృష్ణుడి గీతోపదేశంతో శత్రువులను చీల్చి చెండాడాడు అర్జునుడు. నేడు కూడా దుష్ట సంహారమే పరిష్కారం కాబోతోందా? పాక్ పిశాచ మూకల సంహారంతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ తప్పదా? నేటి భారతం పూరిస్తున్న భారత్‌గీత ఇదేనా.
నాడు గీతోపదేశంతో మార్గదర్శనం.. నేడు గీతోపదేశంతోనే సందేశం
నాటి భారతయుద్ధానికి గీతోపదేశం మార్గదర్శనం చేసింది. శ్రీకృష్ణుడి గీతోపదేశంతో కురుక్షేత్ర సంగ్రామంలో చిచ్చర పిడుగులా చెలరేగాడు అర్జునుడు. అదే గీతోపదేశం నేటి భారత్‌కు కూడా కర్తవ్యం గుర్తు చేస్తోంది. పాకిస్తాన్‌పై ప్రతీకారం కోసం దేశం మీసం మెలేసేలా చేస్తోంది. మన సైన్యం రోషంతో విరుచుకుపడడానికి రెడీగా ఉంది.
పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో.. మొన్న కశ్మీర్ వెళ్లిన భారత్ ఆర్మీ చీఫ్, జనరల్ ఉపేంద్ర ద్వివేది తన మనసులో మాటను చెప్పకనే చెప్పేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో భగవద్గీత ఫోటోతో పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ చీఫ్ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తప్పదని హెచ్చరిక జారీ చేశారు. కృష్ణార్జునుల ఫొటోతో పాకిస్తాన్‌కు వార్నింగ్ జారీ చేశారు.
RSS ఛీఫ్ మోహన్ భగవత్ కూడా…అదే భగవద్గీత సాక్షిగా, పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన ఆయన, తప్పు చేసిన వాళ్లను శిక్షించాలని భగవద్గీత బోధించిందని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌కు దండన తప్పదని పరోక్షంగా చెప్పారు.
అంతిమంగా ఇది భగవద్గీత. భారత గీత. చివరకు శత్రువుకు వధ, వ్యథ తప్పవు అంటున్నాయి సంకేతాలు. పాకిస్తాన్..వినిపిస్తోందా భారత్‌గీతా సందేశం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
