JEE Advanced 2025: జేఈఈ విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. IITల్లో సీట్లు పెరుగుతున్నాయోచ్! ఏ కోర్సుకి ఎన్నంటే..
దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక పరీక్ష కూడా ఇదే నెలలో జరగనుంది..

హైదరాబాద్, ఏప్రిల్ 27: దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలుగా పేరున్న 23 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక పరీక్ష కూడా ఇదే నెలలో జరగనుంది. ఈ పరీక్షకు 2.50 లక్షల మందిని ఎంపిక చేశారు. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, అమ్మాయిలు రూ.1600, ఇతరులు రూ.3,200 చొప్పున ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు మే 11వ తేదీ నుంచి 18 వరకు అందుబాటులో ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షను మే 18వ తేదీన నిర్వహించనున్నారు. పేపర్ 1 పరీక్ష ఉదయం 9గంటల నుంచి మద్యాహ్నాం 12 గంటల వరకు, పేపర్ 2 మద్యాహ్నాం 2:30 నుంచి 5:30 గంటల వరకు జరగుతుంది.
అయితే ఈసారి ఐఐటీల్లో సీట్లు పెరగబోతున్నాయి. వీటితోపాటు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీ (ఎన్‌ఐటీ)ల్లో కూడా సీట్లు పెరిగే అవకాశం కన్పిస్తోంది. సీట్ల పెంపుపై ఇప్పటికే ఐఐటీలు, ఎన్‌ఐటీలు కేంద్రానికి ప్రతిపాదనలు సైతం పంపాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా విస్తరిస్తోందని, ఈ పోటీని తట్టుకోవాలంటే కొన్ని కొత్త కోర్సుల అవసరం ఉందని కేంద్రానికి తెలిపాయి. ఐఐటీల్లో గరిష్టంగా 500 వరకూ సీట్లు పెంచే ఆలోచన ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లోనూ ఇంకో 900 వరకు సీట్లు పెరగొచ్చని భావిస్తున్నారు. దీనిపై కేంద్రం కూడా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, రేపేమాపో అధికారిక ప్రకటనరానున్నట్లు ఓ సీనియర్ ఐఐటీ అధికారి తెలిపారు.
జోసా కౌన్సెలింగ్ పెరిగే ఛాన్స్..
మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష అనంతరం జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ జరుగుతుంది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్‌టీఐల్లో సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ మొదలయ్యే నాటికి కొత్త సీట్లపై స్పష్టత రానుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 17,740 బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడంతో 355 సీట్లు పెరిగాయి. ఐఐటీ తిరుపతిలో 244 సీట్లుంటే, మరో పది పెంచారు. వరంగల్ ఎన్‌ఐటీలో 989గా ఉన్న సీట్లను 1049కు పెంచారు. కొత్తగా 60 సీట్లతో సీఎస్‌ఈ (ఏఐ అండ్ డేటా సైన్స్) కోర్సును ప్రవేశపెట్టారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీట్ల సంఖ్యను 40 నుంచి 110 సీట్లకు పెంచారు. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సీఎస్‌ఈలోనూ సీట్లను పెంచారు. అలాగే అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (మెటీరియల్స్ ఇంజనీరింగ్) బ్రాంచిని కూడా 60 సీట్లతో కొత్తగా ప్రవేశపెట్టారు. ఈసారి మొత్తం ఐఐటీల్లో సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.








