AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్ట్‌ విడుదలపై దుమారం

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్ట్‌ విడుదలైంది. అయితే రిపోర్ట్‌పై పైలట్ల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. స్పష్టమైన కారణాలు లేకుండా రిపోర్ట్ అస్పష్టంగా ఉందంటోంది పైలట్ల సంఘం. ఇంతకూ ప్రాథమిక రిపోర్ట్‌పై పైలట్ల అభ్యంతరం ఏంటి..? అసలు రిపోర్ట్‌లో ఏముంది..?

Air India crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్ట్‌ విడుదలపై దుమారం
Plane Crash
Ram Naramaneni
|

Updated on: Jul 13, 2025 | 9:00 PM

Share

జూన్ 12న జరిగిన అహ్మదాబాద్‌ ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వచ్చింది. విచారణ నివేదిక ప్రకారం, టేకాఫ్ తర్వాత రెండు ఇంజిన్‌ల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్ స్థితికి చేరుకోవడంతో, ఇంజిన్‌లకు ఇంధన సరఫరా ఆగిపోయింది. దీంతో రెండు ఇంజిన్లు సెకన్ వ్యవధిలో ఆగిపోవడంతో విమానం కూలిపోయిందని నివేదిక తెలిపింది. అయితే ప్రాథమిక నివేదికపై ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-ALPA అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నివేదిక పైలట్ల తప్పిదంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని…విచారణలో అనుభవజ్ఞులైన లైన్ పైలట్లను చేర్చాలని డిమాండ్ చేస్తోంది.

భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాదకర సంఘటనల్లో అహ్మాదాబాద్ ప్రమాదం ఒకటి. లండన్ గాట్విక్ వెళ్లే బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్, టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే బి.జె. మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో 241 మంది, భూమిపై 19 మంది మరణించారు. ఒక్క ప్రయాణికుడు మాత్రమే బతికాడు. విమాన ప్రమాదంపై విచారణ భారత్‌లోని ఎయిర్‌క్రాఫ్ట్ ఏక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో -AAIB నేతృత్వంలో జరుగుతోంది. యునైటెడ్ కింగ్‌డమ్ ఎయిర్ ఏక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్, యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ కూడా విచారణలో సహకరిస్తున్నాయి. AAIB ప్రాథమిక నివేదిక ప్రకారం, విమానం టేకాఫ్ సమయంలో ఎటువంటి సాంకేతిక లోపాలను నమోదు చేయలేదని, అయితే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు కటాఫ్ స్థితికి చేరడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపింది. అయితే ఎలా స్విచాఫ్ అయ్యాయో దానికి కారణాలు మాత్రం నివేదిక వెల్లడించలేదు. మామూలుగా స్విచ్‌లకు లాక్ మెకానిజం, రక్షణ బ్రాకెట్‌లు ఉంటాయి. ఇవి పొరపాటు చేయి తగిలో.. కాలు తగిలో పడేవి కాదు. వాంటెండ్లీ ఎవరైనా మాన్యువల్‌గా స్విచాఫ్ చేస్తేనే లాక్ పడుతుంది. కానీ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ డేటా ప్రకారం, ఒక పైలట్ మరొకరిని ఫ్యూయల్ కటాఫ్ చేసినట్లు అడిగితే, తాను చేయలేదని సమాధానం ఇచ్చారు. ఈ గందరగోళం పైలట్ల మధ్య సంభాషణలో స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఎవరు ఏమి చేశారనేది నివేదికలో స్పష్టంగా లేదు. అంతేకాదు ALPA నివేదిక రాత్రి 1:30 గంటలకు లీకైన తీరుపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అధికారిక ఆమోదం లేకుండా మీడియాకు లీక్ అయిన విధానాన్ని ALPA తప్పుబట్టింది. విచారణ బృందంలో అనుభవజ్ఞులైన పైలట్లను చేర్చకపోవడం, సీక్రెట్‌గా విచారణ సాగడం అనేక అనుమానాలకు తావిస్తోందని ALPA ఆందోళన వ్యక్తం చేసింది.

ALPA విచారణలో పారదర్శకత కోసం గట్టిగా పోరాడుతోంది. విచారణ బృందంలో పైలట్ల ప్రతినిధులను పరిశీలకులుగా చేర్చాలని ALPA పదేపదే డిమాండ్ చేసింది. అలాగే పైలట్ ఆత్మహత్య ఊహాగానాలను ALPA తీవ్రంగా ఖండించింది, ఇటువంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు బాధిత కుటుంబాలకు గాయపరుస్తాయని పేర్కొంది. విచారణ పూర్తయ్యే వరకు ఊహాగానాలు వద్దని వాస్తవాలపై ఆధారపడాలని ALPA కోరింది.

విచారణలో బ్లాక్ బాక్స్ డేటా చాలా కీలకం . జూన్ 13న విమాన శిథిలాల నుంచి రెండు ఎన్‌హాన్స్‌డ్ ఎయిర్‌బోర్న్ ఫ్లైట్ రికార్డర్‌లలో ఒకటి బయటపడగా, డిజిటల్ వీడియో రికార్డర్ కూడా స్వాధీనం చేసుకోబడింది. ఈ రికార్డర్‌లు విమానం బయటి, క్యాబిన్ కెమెరాల ఫుటేజీని నమోదు చేస్తాయి. AAIB ల్యాబ్‌లో డేటా విశ్లేషణ జరుగుతోంది, బోయింగ్, జనరల్ ఎలక్ట్రిక్, ఎయిర్ ఇండియా నిపుణుల సహకారంతో విచారణ సాగుతోంది. అయితే ప్రాథమిక నివేదిక ఆధారంగా తీర్మానాలు చేయడం మంచిది కాదని, విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాలని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి