India Oxygen Crisis: ఆక్సిజన్ కోసం యుద్ధ నౌకలు.. సముద్ర సేతు- 2 స్పెషల్ ఆపరేషన్
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ నింపిన క్రయోజనిక్ కంటెయినర్లను తీసుకుని వచ్చేందుకు ఏడు యుద్ధ నౌకలను....
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ నింపిన క్రయోజనిక్ కంటెయినర్లను తీసుకుని వచ్చేందుకు ఏడు యుద్ధ నౌకలను భారత్ రంగంలోకి దించింది. ఇండియాలోని పలు ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ కు తీవ్ర కొరత ఏర్పడగా, చాలా దేశాలు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. ఈ మొత్తం ఆపరేషన్ కు కేంద్రం సముద్ర సేతు 2 అని పేరు పెట్టారు. కోల్ కతా, కొచ్చి, తల్వార్, త్రికండ్, తబర్, జలాశ్వ, ఐరావత్ పేర్లున్న యుద్ధ నౌకలను ఈ ఆపరేషన్ కోసం నియమించినట్టు కేంద్రం తెలిపింది. ఇవన్నీ వివిధ దేశాల నుంచి ఆక్సిజన్ ను తీసుకుని ఇండియాకు రానున్నాయని అధికారులు వెల్లడించారు.
ఇందులో భాగంగా ఐఎన్ఎస్ తల్వార్ 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను మనామా, బెహరైన్ నుంచి తేనుందని, ఐఎన్ఎస్ కోల్ కతా యుద్ధ నౌక, దోహా కు మెడికల్ ఉపకరణాలను తీసుకుని వచ్చేందుకు వెళ్లిందని, రాగానే, కువైట్ కు ఆక్సిజన్ నిమిత్తం బయలుదేరుతుందని భారత నావికాదళం ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. తూర్పు తీర ప్రాంతం నుంచి సింగపూర్ కు ఐఎన్ఎస్ ఐరావత్ వెళుతుందని, ఏ సమయంలో ఎక్కడికి వెళ్లేందుకైనా సిద్ధంగా ఐఎన్ఎస్ జలాశ్వ ఉంటుందని తెలిపారు.
ఇక ఐఎన్ఎస్ కొచ్చి, త్రికండ్, తబార్ నౌకలను అరేబియా సముద్రంలో మోహరించి ఉంచామని, ఇవి దక్షిణ దేశాల నుంచి ఆక్సిజన్ ను తీసుకుని వస్తాయని, మరో 48 గంటల్లో ఎక్కడికైనా బయలుదేరేందుకు ఐఎన్ఎస్ శార్దూల్ ను సిద్ధం చేస్తామని తెలిపారు. అవసరమైతే మరిన్ని యుద్ధ నౌకలను రెడీగా ఉంచుతామని నేవీ పేర్కొంది. గత సంవత్సరం సముద్ర సేతు పేరిట తొలి ఆపరేషన్ ను ప్రారంభించిన ఇండియా, వందే భారత్ మిషన్ లో భాగంగా, పలు దేశాల్లో చిక్కుకుపోయిన దాదాపు 4 వేల మందిని స్వదేశానికి చేర్చింది. ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న ఇండియాకు, ఇప్పటికే విమానాల ద్వారా 830 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ దేశానికి వచ్చింది.
Also Read:ఉత్కంఠ పోరులో మమత ఘన విజయం.. బీజేపీ అభ్యర్థి సువేందుపై 1200 ఓట్ల మెజార్టీతో గెలుపు