India – China: భారత్ – చైనా సరిహద్దుల్లో ఘర్షణ.. వేడెక్కిన రాజకీయాలు.. పార్లమెంట్‌లో చర్చకు విపక్షాల డిమాండ్..
అరుణాచల్ ప్రదేశ్ తూర్పుకొండల్లో నెత్తురు చిందింది. భారత్ చైనా సరిహద్దుల్లో మరో గాల్వాన్ ఘటన ఇరు దేశాల మధ్య హైటెన్షన్ క్రియేట్ చేసింది. తవాంగ్ సెక్టార్ రణక్షేత్రంగా మారింది.

అరుణాచల్ ప్రదేశ్ తూర్పుకొండల్లో నెత్తురు చిందింది. భారత్ చైనా సరిహద్దుల్లో మరో గాల్వాన్ ఘటన ఇరు దేశాల మధ్య హైటెన్షన్ క్రియేట్ చేసింది. తవాంగ్ సెక్టార్ రణక్షేత్రంగా మారింది. ఒక్కరో ఇద్దరో కాదు వందలాది మంది సైనికులు కలబడ్డారు. ఎక్కడైతే ఆయుధాలు నిషేధమో అక్కడే మరోసారి ఆయుధ ప్రయోగం చేసింది చైనా.. యుద్ధరక్కసి డ్రాగన్ కుట్రలను ధీటుగా ఎదుర్కొన్నాయి భారత సైనిక సింహాలు. భారత్ చైనా సరిహద్దుల్లో మంచుకొండల్లో వేడి నెత్తురు పారింది. డిసెంబర్ 9న ఒకసారి డ్రాగన్ కంట్రీ చైనా భారత సైన్యాన్ని రెచ్చగొట్టేయత్నం చేసింది. మరోసారి డిసెంబర్ 11న అదే తీరున డ్రాగన్ విఫలయత్నం చేసింది. భారత సైన్యాన్ని ఉసిగొల్పి.. దాడులకు పాల్పడింది. భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల సైనికుల మధ్య ఈ నెల 9న జరిగిన ఘర్షణలో మన సైనికులు గాయపడ్డారని భారత సైన్యం ధ్రువీకరించింది. అటు చైనా సైన్యంలో భారీ సంఖ్యలో క్షతగాత్రులైనట్టు తెలుస్తోంది. దీని తరువాత రెండు వైపుల నుంచి ఫ్లాగ్ మీటింగ్ జరిగిందని.. ఆ తర్వాత చైనా దళాలు LAC నుంచి వెనక్కి తగ్గాయని పేర్కొంది. భారత్ చైనాల మధ్య సరిహద్దు సమరంలో.. ఏక్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉద్రిక్తత నెలకొంది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు దీనిపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. సరిహద్దుల్లో పరిస్థితులపై, రక్షణ, భద్రతా అంశాలపై చర్చించాలని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం చైనాకు కఠినమైన స్వరంతో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్-చైనా సరిహద్దు సమస్యను మోదీ ప్రభుత్వం అణిచివేస్తోందని, దీని కారణంగానే బీజింగ్ ధైర్యంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది.
ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తారు. దేశాన్ని అంధకారంలో ఉంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తవాంగ్ ఘటన గురించి ప్రభుత్వం పార్లమెంటుకు వివరించాలని కోరారు. ఈ మేరకు తవాంగ్ ఘర్షణపై లోక్‌సభలో వాయిదా తీర్మానానికి ఒవైసీ నోటీసు సమర్పించారు.




జవాన్ల త్యాగాలను కీర్తిస్తూ అరవింద్ కేజ్రీవాల్ ట్విట్ చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదిలాఉంటే.. తవాంగ్ ఘర్షణపై ఈ రోజు పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరిగే అవకాశముంది.
2020 జూన్లో గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. చైనా సైనికుల దుశ్చర్యకు దాదాపు 20 మందికి పైగా సైనికులు వీరమరణం పొందారు. చైనా వైపు కూడా ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ భీకర ఘర్షణ తర్వాత భారతదేశం – చైనాల మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం