Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా పోటీ చేసే స్థానం ఖరారు.. భవానీపూర్ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారంటే..?

పశ్చిమ బెంగాల్‌లోని మూడు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు తాజాగా భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మూడు స్థానాలకు సెప్టెంబర్ 30న ఉప ఎన్నికలు జరగనున్నాయని ఈసీ వెల్లడించింది.

Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా పోటీ చేసే స్థానం ఖరారు.. భవానీపూర్ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారంటే..?
Follow us

|

Updated on: Sep 06, 2021 | 5:53 PM

Mamata Banerjee contests in Bhabanipur: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ మూడో సారి సత్తా చాటి, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అయితే, నందిగ్రామ్‌ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి బరిలోకి దిగిన మమతా బెనర్జీ, తన వెన్నంటే ఉండి బీజేపీలో చేరిన సువేంధు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ దీదీ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. కానీ, ఆరు నెలల్లోపు రాష్ట్రంలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి గెలవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో మమతా పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది.

కాగా, పశ్చిమ బెంగాల్‌లోని మూడు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు తాజాగా భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మూడు స్థానాలకు సెప్టెంబర్ 30న ఉప ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఫలితాలు అక్టోబర్ 3న వెల్లడిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో ఓడిపోయినప్పటికీ మమతా మరోసారి ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందాలని భావిస్తున్నారు. అయితే, ఏ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తారన్న దానిపై టీఎంసీ క్లారిటీ ఇచ్చింది.

కోల్‌కతా నగరంలోని భవానీపుర్‌ నియోజకవర్గం ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తారని ఆదివారం తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారికంగా ప్రకటించింది. ఆ పార్టీ అప్పుడే అక్కడ ప్రచారాన్ని ప్రారంభించింది కూడా. భవానీపుర్‌ మమతకు కంచుకోటలాంటిది. రెండుసార్లు అక్కడ నుంచే గెలుపొందారు. ఆమె పోటీ చేయడానికి వీలుగా భవానీపూర్‌ నుంచి గెలుపొందిన టీఎంసీకే చెందిన సోవన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు త్వరగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేసిన వినతిని ఎన్నికల సంఘం ఆమోదించింది. ఆమె నవంబరు 5లోగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. దీంతో పాటుగా శంషేర్‌ గంజ్‌, జాంగీపుర్‌ సీట్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.

ఎమ్మెల్యే హోదాలో లేని వ్యక్తులు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి అయిన సందర్భాలు కోకొల్లలు. కొద్ది నెలల క్రితం తీరాత్ సింగ్ రావత్ ఎమ్మెల్యే హోదాలో లేనప్పటికీ ఉత్తరాఖండ్ సీఎం అయ్యారు. 2011లో తొలిసారిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా గెలవలేదు. అయితే త్వరలోనే జరగనున్న భవానీపూర్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే.. మమతా సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికలు నిర్వహించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ చాలాకాలంగా ఎన్నికల సంఘాన్ని కోరుతోంది. అంతేకాకుండా టీఎంసీ ప్రతినిధి బృందం ఈసీని అనేకసార్లు కలిసి.. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. జులైలో మమతా బెనర్జీ సైతం మోదీని కలిసి ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని కోరినట్టు నివేదికలు పేర్కొన్నాయి.

ఎన్నికలు వాయిదా వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే సువేంధు అధికారితో సహా ఇతర బీజేపీ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. కరోనా మహమ్మారి కారణంగా ఉప ఎన్నికలను వాయిదా వేయాలంటూ రాష్ట్ర బీజేపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసు ఇంకా విచారణలో ఉన్నందున ఎన్నికలు వాయిదా వేయాలంటూ బీజేపీ కూడా పట్టుబట్టింది.

Read Also… Bigg Boss 5: ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన రవి.. బిగ్‌బాస్‌లో తీర్చలేని కోరికను ఇన్‌స్టాలో నేరవేర్చాడు. రవి టార్గెట్‌ అదేనా?