Rahul Gandhi: మోదీజీ తెలంగాణలో కులగణన మొదలైంది.. టీవీ9 వీడియోను షేర్ చేసిన రాహుల్ గాంధీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే సాగుతోంది.. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. మోదీజీ తెలంగాణలో కుల గణన సర్వే ప్రారంభమైంది.. అంటూ టీవీ9 వీడియోను షేర్ చేశారు.

Rahul Gandhi: మోదీజీ తెలంగాణలో కులగణన మొదలైంది.. టీవీ9 వీడియోను షేర్ చేసిన రాహుల్ గాంధీ
Pm Modi Rahul Gandhi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 09, 2024 | 10:05 PM

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే కంటిన్యూ అవుతోంది. తొలిదశలో భాగంగా కుటుంబ యజమాని, ప్రాథమిక వివరాలతో ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటించే కార్యక్రమం ముగిసిన అనంతరం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది.. అయితే.. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా కులగణన చేసి తీరుతాం అంటూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతూ వస్తున్నారు. దీంతోనే అభివృద్ధి సాధ్యం అంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కులగణన హామీతో పాటు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టి.. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని ఇప్పటికే ప్రకటించింది. కులగణనకు ముందు రాష్ట్రంలో పర్యటించిన రాహుల్ గాంధీ.. కులగణన ద్వారా దేశంలో ఏ వర్గం ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుందన్నారు. దీని ద్వారా అభివృద్ధి ఫలాలు వారికి ఏ విధంగా అందించవచ్చనే అంశంపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ కులగణన కొనసాగుతుండటంపై రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. టీవీ9 వీడియోను షేర్ చేసిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీజీ తెలంగాణలో కులగణన మొదలైందంటూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘మోదీ జీ తెలంగాణలో నేటి నుంచి కులగణన మొదలైంది. రాష్ట్రంలోని ప్రతి వర్గాల అభివృద్ధికి సంబంధించిన విధానాలను రూపొందించడానికి మేము దీని నుంచి పొందిన డేటాను ఉపయోగిస్తాము. త్వరలో మహారాష్ట్రలో కూడా ఇదే జరగనుంది. దేశంలో సమగ్ర కుల గణన చేపట్టడం బీజేపీకి ఇష్టం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే.. నేను మోడీ జీకి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను.. దేశవ్యాప్తంగా కుల గణనను మీరు ఆపలేరు. ఈ పార్లమెంట్‌లోనే కుల గణనను ఆమోదించి.. రిజర్వేషన్లపై 50% గోడను బద్దలు కొడతాం’’.. అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

రాహుల్ గాంధీ ట్వీట్ ..

కాగా.. రాష్ట్రంలో కులగణన వేగవంతం అయింది.. తొలిదశలో ఇంట్లో ఎవరు లేకపోయినా ఫోన్‌ ద్వారా బేసిన్‌ ఇన్ఫర్మేషన్‌తో స్టిక్కర్‌ వేసిన అధికారులు… సమగ్ర కుటుంబ సర్వేకు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇంట్లోనే ఉండాలని చెబుతున్నారు. ఆధార్ కార్డుతో పాటు ఇతర గుర్తింపు కార్డులను దగ్గర పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కుటుంబ సమగ్ర సర్వే తొలి దశ ముగిసిన వెంటనే రెండో దశ ప్రారంభమవుతుందని.. అందరూ సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఈ కుల గణన సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచారాన్ని సమగ్రంగా సేకరిస్తారు. 56 ప్రధాన, 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలతో సర్వేలో సమగ్ర సమాచారాన్ని తీసుకుంటారు. పార్ట్‌-1, పార్ట్‌-2 కింద ఎనిమిది పేజీల్లో ఈ సమాచారాన్ని పూరిస్తారు. మొదటి భాగం (పార్ట్‌-1)లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు తెలపాల్సి ఉంటుంది. పార్ట్‌-1లో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. రెండో భాగంలో ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.. కులం, యజమాని వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, రిజర్వేషన్ల నుంచి పొందిన విద్యా, ఉద్యోగ ప్రయోజనాలు.. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పథకాల పేర్లు, రాజకీయ నేపథ్యం, ప్రభుత్వ పదవులు, ఇతర దేశాలు, రాష్ట్రాలకు వలసలు.. ఉద్యోగాలు, ఆస్తులు, అప్పులు వంటి వివరాలను అడుగుతారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..