న్యూ ఇయర్ వేడుకలను ఆ ప్రాంతాల్లో ప్లాన్ చేసుకున్న టూరిస్టులు.. హిమపాతం వలన తీవ్ర ఇబ్బందులు
మంచు ప్రాంతాల్లో హాలీడేస్ ఎంజాయ్ చేద్దామకున్న పర్యాటకులను వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. మంచు కురిసే ప్రాంతాల్లో జాలీగా న్యూ ఇయర్ వేడుకలు ప్లాన్ చేసుకున్న టూరిస్టులు.. అక్కడ కురుస్తున్న విపరీతమైన మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జమ్మూకశ్మీర్‌తోపాటు హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, మనాలీలోనూ ఇదే వాతావరణ పరిస్థితులున్నాయి.
జమ్ము కశ్మీర్ లో దట్టమైన మంచు కురుస్తోంది. కశ్మీర్ లోయ పెద్ద ఎత్తున హిమపాతం దర్శనమిస్తోంది. విపరీతంగా కురుస్తున్న మంచుతో జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాలు శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. శ్రీనగర్, కశ్మీర్ లోయలోని మైదాన ప్రాంతాల్లో దట్టంగా మంచు పేరుకుపోయింది. దీంతో కశ్మీర్‌లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. భారీ హిమపాతంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. రోడ్డుపై రెండు అడుగుల మేరకు మంచు పేరుకుపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మంచు కారణంగా విమానాలు, రైల్వేలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాలకు విమాన, రైలు సంబంధాలు తెగిపోయాయి. నవ్యుగ్ సొరంగం ఇరువైపులా వర్షం కారణంగా హిమపాతం, కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని రోజంతా మూసివేశారు. మొఘల్ రోడ్డులో ట్రాఫిక్ కూడా స్తంభించింది. జమ్మూలోని పట్నిటాప్, నత్తటాప్, సనసర్ ప్రాంతాల్లో కూడా తెల్లవారుజామున మంచు కురిసింది. రన్ వేపై వెలుతురు సరిగా లేకపోవడం, మంచు పేరుకుపోవడంతో శ్రీనగర్ విమానాశ్రయంలో రెండో రోజు విమానాల రాకపోకలను నిలిపివేశారు. జమ్మూ విమానాశ్రయంలో విమానాలు టేకాఫ్ కాలేదు. మరోవైపు కాశ్మీర్ అంతటా చలిగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రత తగ్గుదల కారణంగా పైప్‌లైన్‌లో నీరు స్తంభించిపోయింది. విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రోడ్డుపై పేరుకుపోయిన మంచును యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు అధికారులు.
ఇక మంచు అందాలు అస్వాదించడానికి వెళ్లిన పర్యటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మంచు కారణంగా వాహనాలు ముందుకు కదలం లేదు. దీంతో పర్యాటకులు, వాహనదారులు గంటల తరబడి వాహనాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. జనవరి 1 నుంచి వాతావరణ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని శ్రీనగర్ వాతావరణ కేంద్రం తెలిపింది. 3 నుంచి 6 అంగుళాల మేర మంచు పేరుకుపోయే అవకాశం ఉందని హెచ్చరించింది.
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు, హిమపాతం కారణంగా మూడు జాతీయ రహదారులతో సహా రాష్ట్రవ్యాప్తంగా 433 రహదారులను మూసివేశారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా హిమాచల్ లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాజధాని సిమ్లా, ధర్మశాలలోని మెక్ లియోడ్ గంజ్ మినహా రాష్ట్రంలోని పర్వతాలను మంచు కప్పేసింది. హిమపాతం తర్వాత కొండ ప్రాంతాల వైపు ప్రజలు తరలిరావడంతో ఆదివారం మనాలీలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు చంబా జిల్లాలో 90 ట్రాన్స్ ఫార్మర్లు మూతపడటంతో 450 గ్రామాల్లో అంధకారం నెలకొంది. మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..