IMD: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. దేశ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు!
రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో దేశంలోని పలు రాష్ట్రాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో నైరుతు రుతుపవణాలు తీరాన్ని తాకనున్నట్టు ఐఎండీ పేర్కొంది.

ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు.. దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే చురుగ్గా కదులుతున్న ఈ నైరుతి రుతుపవనాలు రెండు మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రానున్న రోజుల్లో కోస్తా కర్ణాటక, కేరళ, మాహే, దక్షిణ ఒడిశా, కర్ణాటకలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.
అరుణాచల్ ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలో ఒక్కో చోట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఒక్కో చోట వడగండ్లతో కూడిన ఉరుములు సంభవించే అవకాశం తెలిపింది.
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు
బిహార్, ఝార్ఖండ్, గోవా, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, ఒడిశా కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో ఒక్కో చోట మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఉరుములు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




