Kolkata Doctor Case: ప్రధాని మోదీకి ఐఎంఏ 5 డిమాండ్లతో కూడిన లేఖ.. అవేంటంటే.?
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దేశ వ్యాప్తంగా ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఘటనకు నిరసనగా IMA పిలుపుతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. కోలకతా ఘటనపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటూ లేఖ రాసింది IMA.
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై రేప్ అండ్ మర్డర్ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. ఈఘటనపై విదేశాల్లో కూడా నిరసనలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా లోని మెల్‌బోర్న్‌తో పాటు లండన్‌లో కూడా నిరసనలు జరిగాయి. జస్టిస్ ఫర్ అభయ అంటూ డాక్టర్లు నినాదాలు చేశారు. ఈఘటనతో వైద్యవర్గాల్లో ప్రత్యేకించి మహిళా వైద్యసిబ్బందిలో అభద్రతా భావం పెరిగిందని తెలిపింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ). దేశంలో కేవలం మహిళా డాక్టర్లకే కాకుండా.. పనిచేస్తున్న మహిళల భద్రతకు భరోసా కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ ఐదు డిమాండ్లతో కూడిన లేఖను ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఐఎంఏ రాసింది. ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో సరైన భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఐఎంఏ తన లేఖలో పేర్కొంది.
ఐఎంఏ 5డిమాండ్ లలో మొదటిది.. వైద్యసేవలు, ఆస్పత్రులకు సంబంధించిన చట్టాలను పటిష్ఠం చేయాలని కోరింది. ఆస్పత్రుల్లోనూ విమానాశ్రయాల మాదిరి భద్రతా ప్రొటోకాల్స్ అమలు చేయడంతో పాటు.. వాటిని సేఫ్‌జోన్‌లుగా ప్రకటించాలని రెండో డిమాండ్ పెట్టింది. వైద్యుల పని ప్రదేశంలో పరిస్థితులను మార్చడంతో పాటు.. తగినన్ని విశ్రాంతి గదులు అందుబాటులో ఉంచాలని కోరింది. నేరాల విషయంలో పకడ్బందీ దర్యాప్తు జరపడంతో పాటు.. నిర్ణీత కాలవ్యవధిలో న్యాయం అందించాలని డిమాండ్ చేసింది. అలాగే బాధిత కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారం అందించాలని 5డిమాండ్లను లేఖలో పేర్కొంది ఐఎంఏ.
కోల్‌కతా జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు.. మంగళవారం సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలో లోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. నిందితుడిని ఉరితీయాలని డాక్టర్లతో పాటు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. జూనియర్ డాక్టర్ మర్డర్ కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టింది. నిందితుడి మానసిక పరిస్థితిపై సీబీఐ అధికారులు పరీక్షలు చేస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా సుమోటోగా విచారణ చేపట్టడం సంచలనం రేపుతోంది.