త్యాగమంటే ఇదీ..! విద్యార్థులకు గణితం బోధించేందుకు MNC ఉద్యోగాన్నే వదులుకున్న IIT గ్రాడ్యుయేట్..!
కోచింగ్ సెంటర్లలో, సబ్జెక్ట్‌పై అవగాహన లేని విద్యార్థులలో మార్పు తెచ్చేందుకు.. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన శ్రవణ్ తనదైన రీతిలో విద్యార్థులకు..
మన దేశంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాటజీ(IIT) వంటి ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థల్లోకి ప్రవేశించాలంటే.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE)ని క్రాక్ చేయాలి. కానీ అది చెప్పుకున్నంత తేలికైన విషయం కానేకాదు. సోషల్ మీడియాకు, టెక్నాటజీకి, ఆఖరికీ మనుషులకు కూడా దూరంగా ఉండి కష్టపడాలి. అంతేనా..? రాత్రి పగలు తేడా లేకుండా.. రోజుకు 15, 16 గంటల పాటు చదివితే కానీ సాధ్యం కానంత కష్టంతో కూడుకున్న విషయం అది. అందుకే ఇలాంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు చాలా మంది కోచింగ్‌లో చేరతారు. ఈ నేపథ్యంలోనే కొన్నేళ్లుగా కోచింగ్ సెంటర్లు విపరీతంగా సొమ్ము చేసుకుంటున్నాయి. కానీ అలాంటి కోచింగ్ పొందిన విద్యార్థులు చాలా వరకు సబ్జెక్ట్‌పై తక్కువ అవగాహన కలిగి ఉంటారు. అయితే అలాంటి కోచింగ్ సెంటర్లలో, సబ్జెక్ట్‌పై అవగాహన లేని విద్యార్థులలో మార్పు తెచ్చేందుకు.. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన శ్రవణ్ తనదైన రీతిలో విద్యార్థులకు గణితాన్ని బోధిస్తున్నారు. దీని వల్ల విద్యార్థులు చాలా విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కూడా. యూట్యూబ్‌లో గణిత వీడియోలను అప్‌లోడ్ చేస్తూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నారు శ్రవణ్. మరోవైపు ఎలాంటి గుర్తింపు లేకుండా ఇంకా గుర్తింపును ఆశించకుండా.. విద్యార్థుల కోసం యూట్యూబ్ వీడియోల ద్వారా గణితం బోధించడమే పనిగా గడిపేవారు ఆయన.
అయితే ఈ విషయాలన్నీ కూడా శ్రవణ్ స్కూల్ స్నేహితుడు రాహుల్ రాజ్ చేసిన ట్వీట్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. తన స్నేహితుడు శ్రవణ్ గణితం బోధిస్తున్న వీడియో స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు రాహుల్ రాజ్. ఇంకా శ్రవణ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో పనిచేయడానికి అంగీకరించడం లేదని రాహుల్ చెప్పారు. ఇంకా ‘స్కూల్ ఫ్రెండ్ శ్రవణ్ గణితంలో మేధావి. ఆయన JEE పరీక్షలో ఉత్తీర్ణత సాధించి IIT గువాహతిలో చేరారు. అనంతరం MNC ఉద్యోగాల కోసం ప్రయత్నాలు విడిచిపెట్టి.. విద్యార్థుల కోసం గణితాన్ని బోధించడానికి మార్గాలను అన్వేషిస్తున్నాడు. కోచింగ్ సెంటర్లు అందించలేని గణిత జ్ఞానాన్ని విద్యార్థులకు పంచేందుకు శ్రవణ్‌లోని ఋషి, యాత్రికుడు.. విచ్చలవిడి పిచ్చివాడిలా జీవిస్తున్నాడు’ అని రాహుల్ రాజ్ ట్వీట్ చేశారు.
School friend Shrawan is a maths genius. He qualified JEE & joined IIT Guwahati. He quit the race MNC jobs and kept finding ways to study and teach maths. He lives like sages, like travelers, like nomads, like crazy pple. All to teach good maths which coaching classes have killed pic.twitter.com/kXitMlDO9v
— Rahul Raj (@bhak_sala) February 12, 2023
ట్వీట్ చేసిన అనంతరం కామెంట్ సెక్షన్‌లో ‘శ్రవణ్ కావాలనుకుంటే దేశంలోని ఏదైనా IIT JEE కోచింగ్ సెంటర్‌లలో ఫ్యాకల్టీ పోస్ట్‌ను పొందగలడు, ఇంకా కోట్లు సంపాదించగలరు. కానీ ఆయన అలాంటి ఇన్‌స్టిట్యూట్‌లను, వాటి నిర్వహణను పూర్తిగా ఖండిస్తున్నారు. ఆయన బెంగ ఏమిటంటే.. ఈ వేగవంతంగా ముగిసిపోయే తరగతి గదులు.. గణితం నేర్చుకోవాలన్న విద్యార్థుల ఉత్సాహాన్ని నాశనం చేస్తాయి’ అని రాహుల్ రాజ్ రాశారు. కాగా, శ్రవణ్ నిస్వార్థ ప్రయత్నానికి నెటిజన్లు తమ అభిమానాన్ని, ప్రశంసలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘ఇది అద్భుతమైన ప్రయత్నమ’ని వ్యాఖ్యానించారు. మరో నెటిజన్ ‘ఆయన చేస్తున్నట్లు మీకు సంతోషాన్ని కలిగించే వాటిని చేయండ’ని రాసుకొచ్చాడు. ఇదే తరహాలో ఇంకో నెటిజన్ ‘ఆయన గురించి తెలుసుకోవడం చాలా బాగుంది. నాలాంటి చాలా మందికి ఆయన రోల్ మోడల్’ అంటూ కామెంట్ చేశారు. ఇలా నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..