అన్నామలై ఎంట్రీతో మారుతున్న సమీకరణాలు.. ద్రావిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయమా?
తమిళసింగం అన్నామలై రాజకీయ భవిష్యత్తుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ఆయన కొత్త రాజకీయ వేదిక వైపు అడుగులు వేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, "అన్నామలై ఇక అరవమలై" అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమిళసింగం అన్నామలై రాజకీయ భవిష్యత్తుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ఆయన కొత్త రాజకీయ వేదిక వైపు అడుగులు వేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, “అన్నామలై ఇక అరవమలై” అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమిళనాడు రాజకీయాల ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ప్రాంతీయ భావజాలం ఎప్పటినుంచో కీలక పాత్ర పోషిస్తోంది. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలే రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పరిమిత స్థాయిలోనే ప్రభావం చూపగలిగాయి. దేశంలో 29 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాలు ఒక లెక్క తమిళనాడు ఒక లెక్క. ఈ రాష్ట్రంలో జనానికి ఉన్నంత ప్రాంతీయ పిచ్చి, భాష పిచ్చి, సినిమా వెర్రి ఇతర రాష్ట్రాల ప్రజలకు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే ఈ రాష్ట్ర రాజకీయాలలో ప్రాంతీయ పార్టీలదే హవా. జాతీయ పార్టీలు ఏదో ఒక ప్రాంతీయ పార్టీకి తోకగా ఉండాల్సిందే. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కనుచూపు మేరలో సాధ్యమయ్యే పని కాదు.
ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బీజేపీకి నార్త్ పార్టీ అనే ముద్ర బలంగా ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 12 శాతం ఓట్లు సాధించిందంటే ఆది జాతీయ స్థాయిలో మోదీ ఇమేజ్, రాష్ట్రంలో ఆ రోజు అన్నామలై పాదయాత్ర పుణ్యమే. అవి కూడా లోక్ సభ ఎన్నికలు కాబట్టి. అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ ఓటు శాతం పెరిగినప్పటికీ, అసెంబ్లీ రాజకీయాల్లో ప్రాంతీయ అంశాలే ప్రధానంగా పనిచేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఆయన భవిష్యత్తులో తమిళ గుర్తింపుతో కూడిన ప్రత్యేక రాజకీయ వేదికను నిర్మించుకునే అవకాశాలపై చర్చ సాగుతోంది.
తమిళ రాజకీయాలలో అన్నామలై సొంత రాజకీయ ప్లాట్ ఫార్మ్ నిర్మించుకోవడం సరైన నిర్ణయం. ఇది జాతీయస్థాయిలో బీజేపీకి కూడా ఎంతో అవసరమంటున్నారు విశ్లేషకులు. నిన్నటి తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉండే అన్నా డీఎంకే మూడో స్థానానికి పడిపోయింది. జయలలిత వంటి ఇమేజ్ లీడర్షిప్ ఇప్పుడు ఆపార్టీకి లేదు. తమిళ రాజకీయాల్లో ఆ పార్టీ స్థానాన్ని సినీ హీరో విజయ్ జోసెఫ్ నేతృత్వంలోని టీవీకే ఆక్రమించింది. టీవీకే అధికారంలో ఉండగా, డీఎంకే ప్రతిపక్షంలోకి వచ్చింది. అయినా కూడా డీఎంకేకు భవిష్యత్ కనిపిస్తుంది గానీ, అన్నా డీఎంకేకి ఇక భవిష్యత్ శూన్యమనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
అయితే అధికారంలో ఉన్న టీవీకే గానీ ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే కానీ రెండూ జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తన చిరకాల మిత్రుడు డీఎంకేను వదిలి టీవీకేకు మద్దతుగా నిలిచింది. దీంతో కాంగ్రెస్ కూటమిలో ఉండబోమని డీఎంకే ప్రకటించింది. అయితే ఈ వైరం శాశ్వతం కాకపోవచ్చు. డీఎంకే అయినా టీవీకే అయినా జాతీయ స్థాయి రాజకీయాలలో బీజేపీని వ్యతిరేకిస్తాయి. కాబట్టి బీజేపీకి కూడా తమిళనాడులో ఒక నమ్మకమైన మిత్రపక్షం అవసరం ఉంది. ఇప్పుడు ఆ మిత్రపక్షానికి అన్నామలై రూపంలో అంకురార్పణ జరిగింది.
మరోవైపు, తమిళ రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతున్న ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా రాజకీయ సమీకరణాలను మార్చుతోంది. దీంతో భవిష్యత్తులో డీఎంకే, టీవీకే, అన్నామలై రాజకీయ వేదిక మధ్యే ప్రధాన పోటీ నెలకొనవచ్చని కొందరు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అన్నామలై అనుచరులు మాత్రం ఆయనను తమిళ సంస్కృతి, జాతీయ భావజాలాన్ని సమన్వయం చేసే నాయకుడిగా చూస్తున్నారు. ద్రావిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ఆయన ఎదగగలరని భావిస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యావంతులు, మధ్యతరగతి వర్గాల్లో ఆయనకు మద్దతు పెరిగే అవకాశం ఉందని వారి వాదన.
అన్నామలై ఎపిసోడ్ ను చిన్న ఉదాహరణతో తేల్చేద్దాం. ఒక టాలీవుడ్ టాప్ డైరెక్టర్ తెలుగువీరలేవరా అనే టైటిల్ తో పాన్ ఇండియన్ సినిమా తీసి దేశమంతా విడుదల చేశారనుకుందాం. 28 రాష్ట్రాలలో ఆ సినిమా సబ్జెక్టు వల్ల విజయవంతం అవుతుంది. తమిళనాడులో మాత్రం ప్లాప్ అవుతుంది. తమిళ ప్రేక్షకులు సినిమా సబ్జెక్ట్ ను చూడలేదు. టైటిల్ మాత్రమే చూసి ఆ సినిమాను భాషా భేదంతో నిరాదరించారు. దాంతో డైరెక్టర్ ఆ సినిమా టైటిల్ లో తెలుగు ప్లేసులో తమిళ చేర్చాడు. తమిళవీరలేవరా అనే టైటిల్ తో సినిమా విడుదల చేశాడు. అప్పుడు అక్కడ సినిమా హిట్ అయ్యింది. రేపు అన్నామలై రాజకీయ సినిమా కూడా ఇలాగే ఉండబోతుందనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. భారతీయ బ్రాండ్ తో రాని హిట్ ఆయనకు తమిళ్ బ్రాండ్ తో రాబోతుందన్న మాట.
అయితే ఇవన్నీ ప్రస్తుతం రాజకీయ చర్చల స్థాయిలోనే ఉన్నాయి. అన్నామలై భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడుతున్న వేళ, అన్నామలై పేరు చుట్టూ జరుగుతున్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతోంది. రానున్న సంవత్సరాల్లో తమిళ రాజకీయాల దిశను నిర్ణయించే కీలక నాయకుల్లో ఆయన ఒకరుగా నిలుస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
