I.N.D.I.A Politics: బెంగళూరులో పేరు.. ముంబైలో జెండా, లోగో ఆవిష్కరణ.. విపక్షాల ప్రధాని అభ్యర్థి ఆయనేనా?
ఇప్పటికే 26 పార్టీల సమ్మేళనంగా ఉన్న I.N.D.I.Aలో మరో 3-4 పార్టీలు చేరి ఆ సంఖ్యను ముచ్చటగా 30కి చేర్చే అవకాశం లేకపోలేదు. ఏ కూటమిలోనూ లేని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతిని కూటమిలో కలుపుకునేందుకు యత్నాలు సాగుతున్నాయి. కూటమి తొలి సమావేశానికి ఆహ్వానించకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న మాయావతి.. ఇది కేవలం చేతులు కలిపే కూటమే తప్ప మనసులు కలిసే కూటమి కాదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ఆమె చేరికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మహారాష్ట్రలో షెట్కారీ సంఘటన్‌తో పాటు..
బెంగళూరులో జరిగిన ప్రతిపక్ష పార్టీల రెండవ సమావేశంలో కూటమి పేరును I.N.D.I.A గా నామకరణం చేసిన కూటమి నేతలు తదుపరి ముంబైలో జరిగే సమావేశంలో తాము ఎదుర్కొనే అన్ని విమర్శలకు బదులివ్వాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వివిధ రాష్ట్రాల్లో పార్టీల మధ్య నెలకొన్న విబేధాలు, రాజకీయ వైరాన్ని మరచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ఏకమైన విపక్ష నేతలు.. తమ మాదిరిగానే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిసి పనిచేసేందుకు వీలుగా ఉమ్మడి ‘జెండా’ను రూపొందించారు. విపక్షాలకు నాయకత్వం లేదు, జెండా లేదు, ఎజెండా అంతకంటే లేదు అంటూ అధికార కూటమి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (N.D.A) నుంచి ఎదురవుతున్న విమర్శలకు బదులివ్వడంతో పాటు తమ ఐక్యతను బూత్ స్థాయికి తీసుకెళ్లినప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అధికార పక్షానికి లాభం కలుగకుండా ఉండేందుకు ఎన్డీఏ కూటమిలో లేని ఏ పార్టీనైనా కలుపుకోవాలని, కూటమిని మరింత బలోపేతం చేయాలని చూస్తున్నారు.
ఇప్పటికే 26 పార్టీల సమ్మేళనంగా ఉన్న I.N.D.I.Aలో మరో 3-4 పార్టీలు చేరి ఆ సంఖ్యను ముచ్చటగా 30కి చేర్చే అవకాశం లేకపోలేదు. ఏ కూటమిలోనూ లేని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతిని కూటమిలో కలుపుకునేందుకు యత్నాలు సాగుతున్నాయి. కూటమి తొలి సమావేశానికి ఆహ్వానించకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న మాయావతి.. ఇది కేవలం చేతులు కలిపే కూటమే తప్ప మనసులు కలిసే కూటమి కాదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ఆమె చేరికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మహారాష్ట్రలో షెట్కారీ సంఘటన్‌తో పాటు మరికొన్ని పార్టీలు కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎన్డీఏకు దూరమై ఒంటరిగా ఉన్న శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్‌తో నితీశ్ కుమార్ మంతనాలు సాగిస్తున్నారు. అలాగే హర్యానాకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (INLD) నేత, మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలా కూడా కూటమిలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 25న ఆయన హిస్సార్‌లో తలపెట్టిన భారీ సభకు బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలందరినీ ఆయన ఆహ్వానించారు.
విపక్ష కూటమి పేరును దేశం పేరు స్ఫురించేలా ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A)గా నామకరణం చేసిన తర్వాత అధికార కూటమి నుంచి హేళన, ఎద్దేవా, వ్యంగ్యం, వెటకారాలు మొదలయ్యాయి. పేరులో ఇండియా ఉంటే సరిపోదని, ఇండియన్ ముజాహిదీన్ వంటి, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి ఉగ్రవాద, దేశ విద్రోహ సంస్థల పేర్లలో కూడా ఇండియా ఉందని స్వయానా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే ఎగతాళి చేశారు. ‘క్విట్ ఇండియా’ ఉద్యమం మొదలైన రోజు నాడు బ్రిటీష్ పాలకులను దేశం విడిచి వెళ్లేందుకు ఆ ఉద్యమం మొదలైతే.. నేడు అహంభావపూరిత విపక్ష కూటమి (గమండియా ఘట్‌బంధన్)ను వదిలించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఇన్ని రకరాలుగా అపహాస్యానికి గురైన విపక్ష కూటమికి జెండా, ఎజెండాతో పాటు నాయకత్వం లేదని, ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలన్న డిమాండ్లు కూడా బీజేపీ నేతల నుంచి వ్యక్తమయ్యాయి. వాటన్నింటికీ ముంబైలో సమాధానం చెప్పేందుకు I.N.D.I.A నేతలు సిద్ధమవుతున్నారు.
త్రివర్ణ పతాకాన్ని తలపించేలా జెండా..
కూటమి పేరే కాదు.. కూటమి జెండా కూడా జాతీయ పతాకాన్ని తలపించేలా త్రివర్ణ శోభితంగా ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు. రాజ్యాంగం, చట్టాల ప్రకారం జాతీయ జెండాను అనుకరించకూడదు. అయితే జాతీయ జెండాను తలపించేలా ఉన్న కాంగ్రెస్ జెండా మాదిరిగానే కూటమి జెండాను కూడా రూపొందించినట్టు తెలిసింది. మధ్యలో అశోక చక్రం స్థానంలో ప్రతిపక్షాల ఐక్యతను సూచించేలా లోగోను ముద్రించే అవకాశం ఉంది. జెండా రూపకల్పన, మధ్యలో లోగో ముద్రణ విషయంలో న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది.
ప్రధాని అభ్యర్థిగా ఖర్గే?..
విపక్ష కూటమికి నాయకత్వం లేదని, ప్రధాని అభ్యర్థి ఎవరో ముందే ప్రకటించే పరిస్థితి లేదని ఎదురవుతున్న విమర్శలకు కూడా చెక్ పెట్టేందుకు ఆ కూటమి పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఎలాగైనా రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని, భారత్ జోడో యాత్ర తర్వాత మారిన రాహుల్ గాంధీకి ప్రజల్లోనూ ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని చెబుతున్నారు. మోడీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు జైలుశిక్షకు గురై, అనర్హత వేటుకు గురైన రాహుల్ గాంధీ పట్ల సానుభూతి పెరిగిందని వారు భావిస్తున్నారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రతిపాదించే విషయంలో కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం సంగతెలా ఉన్నా.. కూటమి భాగస్వామ్యపక్షాల నుంచి ఏమాత్రం ఆమోదం లభించే అవకాశం లేదు. రాజకీయానుభవం, పాలనానుభవంలో శరద్ పవార్, మమత బెనర్జీ, నితీశ్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ప్రధాని పదవికి తామూ అర్హులమేనని పట్టుబట్టే అవకాశం ఉంది. ఇది అనైక్యతకు దారితీసి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మధ్యేమార్గంగా అందరికీ ఆమోదయోగ్యమైన నేత కోసం అన్వేషిస్తున్నారని.. ఆ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పేరు తెరపైకి వచ్చిందని చర్చ జరుగుతోంది. పైగా దళిత వర్గానికి చెందిన నేత కావడంతో.. బడుగు, బలహీన వర్గాలను ఆకట్టుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నేతలు ప్రధాని మోదీ విషయంలో ప్రయోగించే ఓబీసీ కార్డును కూడా ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం.
జెండాయే కాదు.. ఎజెండా కూడా ఖరారు..
విపక్ష కూటమి సమావేశాల్లో కనిపించే ఐక్యత తీరా ఎన్నికలు సమీపించాక ఉంటుందా అన్న సందేహం ఇంటా, బయటా ఉంది. ఈ సవాలును ఎదుర్కొనేందుకు కూడా స్పష్టమైన ఎజండాతో ముందుకెళ్లాలని నేతలు భావిస్తున్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం సాధిస్తే.. ప్రచారపర్వంలో దూసుకెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. వేదికలపై నేతలు కలిసినంత సులభంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిసి పనిచేయడం సాధ్యం కాదు. అయితే ఉమ్మడి జెండాను విస్తృతంగా ప్రచారంలో ఉపయోగించడం ద్వారా ఒకే జెండా కింద మిత్రపక్షాల పార్టీల కార్యకర్తల మధ్య సామరస్యం ఏర్పడుతుందని అంచనాలు వేస్తున్నారు. కూటమిలోని అన్ని పార్టీలు తమ సొంత జెండాతో పాటు కూటమి జెండాను తాము ప్రయాణించే వాహనాలతో పాటు ప్రచారంలో విస్తృతంగా వినియోగించేలా వ్యూహాలు రూపొందిస్తున్నారు. జెండా, లోగో, ఎజెండా, ప్రధాని అభ్యర్థి వంటి కీలకాంశాలను ముంబైలో జరిగే కూటమి మూడో సమావేశంలోనే ఖరారు చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..