AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంఘ విద్రోహ చర్యలకు అడ్డాగా జైళ్లు.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు

సంఘ విద్రోహ చర్యలకు జైళ్లు అడ్డాగా మారుతున్నాయి. జైళ్ల నుంచే నేరగాళ్లు తమ నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్న ఉదంతాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అత్యంత పటిష్ట భద్రతా వలయంలో ఉండే..

సంఘ విద్రోహ చర్యలకు అడ్డాగా జైళ్లు.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు
Jail
Janardhan Veluru
|

Updated on: May 04, 2022 | 12:27 PM

Share

Indian Prisons: సంఘ విద్రోహ చర్యలకు జైళ్లు అడ్డాగా మారుతున్నాయి. జైళ్ల నుంచే నేరగాళ్లు తమ నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్న ఉదంతాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అత్యంత పటిష్ట భద్రతా వలయంలో ఉండే జైళ్లలో ఉన్న నేరగాళ్లు, తీవ్రవాదులు మొబైల్ ఫోన్లను వాడుతున్న ఘటనలు అధికారుల తనిఖీల్లో బయటపడుతూనే ఉన్నాయి. జైలు సిబ్బందే కాసుల కక్కుర్తితో జైళ్లలోని నేరగాళ్లకు కావాల్సిన అన్ని సమకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. సంఘ విద్రోహ చర్యలకు జైళ్లు అడ్డాగా మారకుండా పగడ్భందీ భద్రతా చర్యలు తీసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది. ఇందు కోసం తరుచూ జైళ్లలో తనిఖీలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. జైలు ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని, తద్వారా ఖైదీలను వైద్య సదుపాయాల కోసం జైలు నుంచి బయటకు పంపాల్సిన పరిస్థితిని నివారించాలని సూచించింది.

అలాగే ఖైదీలు కుంగుబాటుకు గురికాకుండా సమర్థులైన మానసిక వైద్యులు జైళ్లలో అందుబాటులో ఉండేలా చూడాలని రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. కారాగార జీవితాన్ని గడుపుతున్న ఖైదీలకు జీవితంపై విరక్తి ఏర్పడకుండా.. సానుకూల దృక్పథం ఉండేలా మానసిక వైద్యులు సలహాలు చేయాలని సూచించింది. ఖైదీల్లో సరైన పరివర్తన, వ్యక్తిత్వాన్ని తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది.

జైళ్లలో అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జైలు సిబ్బందికి ప్రతి రెండేళ్లకు తప్పనిసరిగా ఇంటర్ జైలు బదిలీలు చేపట్టాలని సూచించింది. అలాగే జైలుకు లోపల, బయట సిబ్బంది సంచారంపై నియంత్రణ ఉండాలని ప్రత్యేక ఉత్తర్వుల్లో హోం శాఖ ఆదేశించింది.

జైలు కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న ఎన్జీవోల పుట్టుపూర్వోత్తరాలను క్రాస్ చెక్ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ సూచించింది. ఖైదీలు చెడు సిద్ధాంతాలతో ప్రేరేపితం కాకుండా.. లైబ్రరీలలో సరైన పుస్తకాలు ఉండేలా చూడాలని సూచించింది. జైళ్లలోని ఖైదీలు అక్రమంగా మొబైల్ ఫోన్లు వినియోగించకుండా పగడ్భందీ చర్యలు చేపట్టాలని సూచించింది. దీని కోసం జైలు పరిసరాల్లో పటిష్ట మొబైల్ జామింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తొలిసారి నేరం చేసిన ఖైదీలు.. వరుస నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లకు విడివిడిగా వార్డులు, జైలు కాంప్లెక్స్‌లు కేటాయించాలని కేంద్ర హోం శాఖ సూచించింది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

Also Read..

Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Unemployment : నిరుద్యోగ రేటు ఏప్రిల్ లో పెరిగింది.. ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉందంటే.. పట్టణాల కంటే గ్రామాలే బెటర్!