Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు
హనుమాన్ చాలీసా కేసులో బుధవారం అమరావతి స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా, ఆమె ఎమ్మెల్యే భర్త రవి రాణా సెషన్స్ కోర్టులో బెయిల్ లభించింది
Navneet Rana: హనుమాన్ చాలీసా కేసులో బుధవారం అమరావతి స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా, ఆమె ఎమ్మెల్యే భర్త రవి రాణా సెషన్స్ కోర్టులో బెయిల్ లభించింది. 50 వేల వ్యక్తిగత పూచీకత్తుపై రానా దంపతులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేస్తూనే, కోర్టు దంపతులకు కోర్టు అనేక షరతులు కూడా విధించింది. కోర్టు ఆదేశాల మేరకు రానా దంపతులు మీడియాతో మాట్లాడలేరు. సాక్ష్యాలను తారుమారు చేయడం కానీ, ఆ జంట మరోసారి అలాంటి నేరానికి పాల్పడవద్దని కోర్టు ఆదేశించింది. అంతే కాకుండా పోలీసులు 24 గంటల ముందే నోటీసు ఇస్తారని, ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి హాజరు కావాల్సి ఉంటుందని తెలిపింది. మరోసారి అలాంటి నేరానికి పాల్పడితే బెయిల్‌ను రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. ఈరోజు సాయంత్రం రానా జంట జైలు నుంచి బయటకు రావచ్చని తెలుస్తోంది.
బాంద్రాలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యక్తిగత నివాసం ‘మాతోశ్రీ’ వెలుపల హనుమాన్ చాలీసా పఠించాలన్న బహిరంగ ప్రకటన కారణంగా తలెత్తిన వివాదంలో స్వతంత్ర లోక్‌సభ సభ్యుడు నవనీత్ రాణా, ఆమె ఎమ్మెల్యే భర్త రవి రాణా ఏప్రిల్ 23న అరెస్టయ్యారు. బెయిల్ పిటిషన్‌పై శనివారం ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు పూర్తి చేశారు. ప్రత్యేక న్యాయమూర్తి ఆర్‌ఎన్ రోకడే ఈ ఉత్తర్వును సోమవారానికి రిజర్వ్ చేశారు. అయితే కోర్టు ఇతర వ్యవహారాల్లో బిజీగా ఉండటం, రాణా దంపతుల బెయిల్ ఆర్డర్ నుండి డిక్టేషన్ పూర్తి కానందున బెయిల్ బుధవారం మంజూరైంది.
దేశద్రోహం, శత్రుత్వాన్ని ప్రోత్సహించారనే ఆరోపణలపై ముంబై పోలీసులు తమపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కేసులో రాణా దంపతులు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ‘మాతోశ్రీ’ వెలుపల హనుమాన్ చాలీసాను పఠించాలన్న పిలుపు వివిధ సమూహాల మధ్య శత్రుత్వం లేదా ద్వేష భావాలను పెంపొందించే ఉద్దేశ్యంతో IPC యొక్క సెక్షన్ 153 (A) కింద కేసు నమోదు చేశారని బెయిల్ పిటిషన్‌లో పేర్కొంది.
ముఖ్యమంత్రి వ్యక్తిగత నివాసం దగ్గర హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టాలన్నా, విద్వేషాలు రెచ్చగొట్టాలన్న ఉద్దేశం రాణా దంపతులకు లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. తూర్పు మహారాష్ట్రలోని అమరావతి నుండి లోక్‌సభ సభ్యులుగా నవనీత్ రాణా ప్రాతినిథ్యం వహిస్తుండగా, బద్నేరా నుండి ఎమ్మెల్యేగా రవి రాణా ఉన్నారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబై పర్యటనను ఉటంకిస్తూ థాకరే వ్యక్తిగత నివాసం వెలుపల హనుమాన్ చాలీసా పఠించే ప్రణాళికను విరమించుకున్నారు.