HMPV: భయపెడుతోన్న కొత్త వైరస్.. మరోసారి లాక్‌డౌన్ తప్పదా..?

చైనాకు రోగమొచ్చింది. ప్రపంచమంతా వణికిపోతోంది. కేసుల ఊసులేదు..మరణాల సంఖ్య కూడా తెలియదు. చైనాలో మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారనే అనధికార వార్తలు.. ఈకొత్త కరోనా ప్రాణాంతకమా అంటే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కరోనా వేరియంట్లలాగే HMPV వైరస్‌ ఉపిరి తిత్తుల్ని టార్గెట్ చేస్తుంది.

HMPV: భయపెడుతోన్న కొత్త వైరస్.. మరోసారి లాక్‌డౌన్ తప్పదా..?
Hmpv Effect In India
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 06, 2025 | 8:14 PM

చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటానిమో -HMPV వైరస్‌..అనుకున్న దాని కంటే వేగంగానే ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌లో ఇప్పటిదాకా నాలుగు HMPV వైరస్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో రెండు కర్ణాటక రాజధాని బెంగళూరులో కాగా.. మరో కేసును గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గుర్తించారు. ఇక బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మరో కేసును గుర్తించారు. ఐదు నెలల చిన్నారికి.. HMPV పాటిజివ్‌గా తేలింది. ఈ విషయాలను ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటికే బెంగళూరులో 3, 8 నెలల వయసు కలిగిన ఇద్దరు చిన్నారులకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్‌గా తేలగా.. అహ్మదాబాద్‌లో 2 నెలల చిన్నారికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారించింది. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందంటున్నారు డాక్టర్లు. చిన్నారుల్లో ఎలాంటి లక్షణాలు బయటపడలేదని ICMR చెబుతోంది. పలువురు చిన్నారులకు టెస్ట్‌ చేసిన సమయంలో వైరస్‌ బయటపడిందన్న ICMR పేర్కొంది.

మరోవైపు కరోనా వేరియంట్లలాగే HMPV వైరస్‌ ఉపిరి తిత్తులను టార్గెట్ చేస్తుంది. జలుబు, దగ్గు, శ్లేష్మం, జ్వరం…ప్రస్తుతం ప్రపంచం కరోనాతో ఎఫెక్టయి ఊపిరితిత్తులు పూర్తిగా బలహీనపడ్డాయి..మరి ఈటైమ్‌లో ఈకొత్త వైరస్ మరింత ప్రభావం చూపుతుందా…అసలు చైనాలో ఏం జరుగుతోంది…మన దేశం ఏం చేయబోతోంది.. తెలుసుకుందాం..!

దేశవ్యాప్తంగా నలుగురికి పాజిటివ్

కొత్త వైరస్ బెంగళూరులో 8 నెలల చిన్నారి, 3 నెలల చిన్నారిలో HMPV ఇన్ఫెక్షన్ కనుగొన్నారు వైద్యులు. గుజరాత్‌లో 2 నెలల చిన్నారికి HMPV సోకినట్లు గుర్తించారు. కోల్‌కతాలో మరో చిన్నారికి చైనా వైరస్ లక్షణాలు కనిపించాయి. ఈ చిన్నారులు జ్వరంతో బాధపడుతున్నారు. అయితే, ఈ పిల్లలలో చైనాకు వెళ్ళిన ప్రయాణ చరిత్ర లేదు. కానీ హెచ్‌ఎంపీవీ తొలి కేసు గుజరాత్‌లో వెలుగు చూసింది. అహ్మదాబాద్‌లో సోకిన చిన్నారికి జలుబు, జ్వరం లక్షణాలు ఉన్నాయి. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తర్వాత, శిశువు క్షేమంగా ఉందని, అయితే ప్రైవేట్ ల్యాబ్‌లో చిన్నారికి HMVP రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చింది. పిల్లలను బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ బ్రోంకోప్‌న్యూమోనియా అనే న్యుమోనియా చరిత్ర ఉంది. ఇది ఒక రకమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్. బ్రోంకోప్ న్యుమోనియా ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లోని ఆల్వియోలీని ప్రభావితం చేస్తుంది.

కేంద్ర బృందం అత్యవసర భేటీ

చైనాలో HMPV వైరస్ కేసులు పెరుగుతుండటంపై భారత్ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశమైంది. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి భారత్‌లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని సమావేశంలో నిపుణులు తెలిపారు. చైనాలో జరగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. WHO కూడా చైనాలో పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలిపింది. చలికాలంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్ ఫ్లూయెంజా, RSV, HMPV వంటి వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని జాయింట్ మానిటరింగ్ గ్రూప్‌ తెలిపింది. భారత్‌లో HMPV వైరస్‌ గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు చోట్ల RSI, HMPV వంటి పరీక్షలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక వేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

మరోసారి మాస్కులు తప్పనిసరి..!

భారతదేశంలో HMPV వైరస్ కేసులు పెరుగుతుండడంపై భారత్ అప్రమత్తమైంది. ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇక తెలంగాణ సర్కార్‌ కూడా అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్న వారు మాస్కులు ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో HMPV వైరస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేసింది. కానీ జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు సమూహాలకు దూరంగా ఉండాలని సూచించింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్న జాగ్రత్తలు ఏంటో చూద్దాం.

చేయాల్సిన పనులు, చేయకూడని పనులుః

దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు మాస్క్‌ లేదా కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలి.

ఎవరికీ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకూడదు.

తరచు చేతులను సబ్బుతో కానీ శానిటైజర్‌తో కానీ శుభ్రం చేసుకోవాలి.

టిష్యూ పేపర్‌, కర్చీఫ్‌ని రీయూజ్‌ చేయకూడదు.

దగ్గు, జలుబు ఉంటే…రద్దీగా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లకూడదు.

అనారోగ్యంతో ఉన్నవారికి దగ్గరగా ఉండకూడదు.

జలుబుతో బాధ పడేవారికి భౌతిక దూరం పాటించాలి.

కళ్లు, ముక్కు, నోటిని తరచు ముట్టుకోకూడదు.

ఇంట్లోకి తగినంత గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి.

పబ్లిక్‌ ప్లేసెస్‌లో ఉమ్మి వేయరాదు.

అనారోగ్యంగా ఉంటే ఇంటికే పరిమితం కావాలి.

మరీ ముఖ్యంగా డాక్టర్‌ని సంప్రదించకుండా మందులు వాడరాదు.

కొత్త వైరస్‌లో కరోనా లక్షణాలే..!

ఈ కొత్త వైరస్‌లో, దాదాపు కరోనా వైరస్ లాంటి లక్షణాలే ఉన్నాయి. ఇది ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. తుమ్ము, దగ్గు, లాలాజలం ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. కరోనా లాగే గాలి ద్వారా వ్యాపించగలదని డాక్టర్లు చెబుతున్నారు. ఇది న్యుమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుందంటున్నారు డాక్టర్లు. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులు, ముఖ్యంగా శిశువులు అలాగే 65 ఏళ్ల పైబడిన వృద్ధుల్లో లక్షణాలు త్వరగా కనిపిస్తాయంటున్నారు వైద్యులు. దీర్ఘకాలిక వ్యాధులు, టీబీ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవీ వంటి వ్యాధులతో బాధపడేవారికి, ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

HMPV వైరస్‌పై చైనా స్పందన ఇదే!

ఇక చైనాలో విజృంభిస్తున్న HMPV వైరస్‌పై ఆ దేశం స్పందించింది. దాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేసింది. ఈ వైరస్‌ కారణంగా ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిందని వస్తోన్న నివేదికలను తోసిపుచ్చింది. శీతాకాలంలో వచ్చే ఈ శ్వాసకోశ వ్యాధుల తీవ్రత గత ఏడాదితో పోలిస్తే తక్కువగానే ఉందని చైనా పేర్కొంది. విదేశీయులు తమ దేశంలో సురక్షితంగా పర్యటించవచ్చని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.

రంగంలోకి ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే చైనాలో కొనసాగుతున్న చర్యలను తెలియజేయడానికి పరిస్థితిపై సకాలంలో నవీకరణలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఇటీవలి సన్నద్ధత వ్యాయామాలు శ్వాసకోశ వ్యాధులలో ఏవైనా సంభావ్య పెరుగుదలను నిర్వహించడానికి భారతదేశం బాగా సన్నద్ధమైందని మరియు అవసరమైతే ప్రజారోగ్య జోక్యాలను వెంటనే అమలు చేయవచ్చని చూపించాయి.

మొట్టమొదటి కేసు ఎప్పుడు..?

HMPV మొట్టమొదట 2001లో కనుగొన్నారు. ఇది శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ (RSV)తో పాటు న్యుమోవిరిడే కుటుంబంలో భాగం. HMPVకి సంబంధించిన లక్షణాలు సాధారణంగా దగ్గు, జ్వరం, నాసికా రద్దీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. అంతకుముందు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌కు చెందిన డాక్టర్ ఒకరు.. ఈ వ్యాధి వృద్ధులు, చాలా చిన్న పిల్లలలో ఫ్లూ లాంటి లక్షణాలను కలిగిస్తుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

వైరస్‌పై వైద్యుల సూచన

శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా క్రమం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఎవరికైనా దగ్గు, జలుబు ఉంటే, అతను చాలా మంది వ్యక్తులతో సంప్రదించకుండా ఉండాలి, తద్వారా ఇన్‌ఫెక్షన్ వ్యాపించదు’ అని వైద్యులు తెలిపారు. ‘దగ్గు, తుమ్ముల కోసం ప్రత్యేక రుమాలు లేదా టవల్ ఉపయోగించండి. మీకు జలుబు లేదా జ్వరం వచ్చినప్పుడు, సాధారణ మందులు తీసుకోండి, లేకపోతే ప్రస్తుత పరిస్థితికి భయపడాల్సిన అవసరం లేదు’ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనం

చైనా నుంచి వచ్చిన హెచ్‌ఎంపీవీ వైరస్‌ కారణంగా సోమవారం(జనవరి 6) స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమైంది. దేశవ్యాప్తంగా నలుగురికి హెచ్‌ఎంపీవీ వైరస్‌ పాజిటివ్ రావడంతో స్టాక్ మార్కెట్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా క్షీణతతో ముగిశాయి. టాటా స్టీల్ నుంచి ఇన్ఫోసిస్ వరకు 30 షేర్లలో 28 నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు 2 శాతానికి పైగా క్షీణించాయి. ఈ పతనం కారణంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు రూ.11 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..