అక్రమ వలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమ వలసలు, మతపరమైన మార్పులు, ఇతర అసాధారణ కారణాల వల్ల చోటుచేసుకుంటున్న జనాభా మార్పులను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ త్వరలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనుంది. జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవ్లేకర్ నేతృత్వంలోని ఈ కమిటీ క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి, జనాభా మార్పుల కారణాలను విశ్లేషించనుంది. కమిటీ వ్యూహాలు, కార్యాచరణపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమై చర్చించింది...

దేశంలో అక్రమ వలసలు, అసాధారణ కారణాల వల్ల సంభవిస్తున్న జనాభా మార్పుల పై క్షేత్ర స్థాయి అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ త్వరలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈ మేరకు ఈ అత్యున్నత స్థాయి కమిటీ చైర్మన్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవ్లేకర్ (రిటైర్డ్) నేతృత్వంలోని బృందం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి తమ వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై వివరాలను అమిత్ షా కు తెలియజేసింది. రాష్ట్ర ఈ కమిటి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా యంత్రాంగాల నుంచి క్షేత్రస్థాయి వివరాలు, జనాభా మార్పులకు సంబంధించి స్థానిక అభిప్రాయాలను నేరుగా సేకరించనుంది.
ఈ పర్యటనలను మరింత సమర్థవంతంగా చేయడానికి సంబంధిత సమాచారాన్ని ముందుగానే స్వీకరించేందుకు వివరణాత్మక ప్రశ్నావళి సిద్ధం చేసినట్లు కమిటీ హోం మంత్రికి తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో కూడా సంప్రదింపులు జరిపేందుకు ప్రణాళికలు ఉన్నట్లు వెల్లడించింది. కమిటి వ్యూహాన్ని అభినందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కమిటీ కార్యకలాపాలకు అన్ని విధాలైన సహాయ సహకారాలు అందించాలని హోం కార్యదర్శికి సూచించారు. అలాగే కమిటీ తన సిఫార్సులను కేంద్రానికి వీలైనంత త్వరగా సమర్పించాలని ఆదేశించారు. 2025 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి జనాభా మిషన్ ను ప్రకటించారు.
దీని కింద అక్రమ వలసలు, మతపరమైన మార్పులు ఇతర అసాధారణ కారణాల వల్ల ఏర్పడుతున్న జనాభా మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేసి, తగిన విధానాలు, శాసనాలు పరిపాలనా చర్యలను సూచించేందుకు కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్ గా జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవ్లేకర్ (రిటైర్డ్) సభ్యులుగా జనగణన కమిషనర్, దుర్గా శంకర్ మిశ్రా (రిటైర్డ్ IAS), బాలాజీ శ్రీవాస్తవ (రిటైర్డ్ IPS), డాక్టర్ షమికా రవి (పీఎంఈఏసీ సభ్యురాలు)ఉన్నారు. ఈ కమిటీ దేశ వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న జనాభా మార్పులను ఖచ్చితంగా అంచనా వేసి, వాటి కారణాలను విశ్లేషించి, భవిష్యత్తు కోసం సమగ్ర సిఫార్సులు కేంద్రప్రభుత్వానికి చేయనుంది.కమిటి సిఫార్సులకు అనుగుణంగా దేశంలో అక్రమ వలసలు, అసాధారణ కారణాల వల్ల సంభవిస్తున్న జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.




