Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snow Rain: ఉత్తరాదిని వణికిస్తున్న మంచు వర్షం.. శ్వేతవర్ణంతో మెరిసిపోతున్న కొన్ని ప్రాంతాలు

ఉత్తరాదిని భారీ హిమపాతం వణికిస్తోంది. జమ్ముకశ్మీర్‌, కేదార్‌నాథ్‌లో భారీగా మంచు కురుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలో నమోదవుతున్నాయి. ఇళ్లను, రోడ్లను మంచు కప్పేసింది.

Snow Rain: ఉత్తరాదిని వణికిస్తున్న మంచు వర్షం.. శ్వేతవర్ణంతో మెరిసిపోతున్న కొన్ని ప్రాంతాలు
Snow Rain North India
Follow us
Surya Kala

|

Updated on: Jan 31, 2023 | 7:37 AM

ఉత్తరాది రాష్ట్రాలు గజగజ వణికిపోతున్నాయి. జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ మంచు ముద్దలుగా మారిపోయాయి. ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురుస్తోంది. దీంతో ఎటు చూసినా మంచు కుప్పలే కనిపిస్తున్నాయి. చెట్లు, ఇళ్లు, రోడ్లు, వాహనాలను మంచు కప్పేసింది. రన్‌వేలు కూడా మంచులో కూరుకుపోయాయి. మంచు వర్షంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రన్‌ వేలపై పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు సిబ్బంది.

శ్రీనగర్‌, బారాముల్లాలో కురుస్తున్న మంచు వానతో చలి తీవ్రత మరింత పెరిగింది. పొగమంచు కమ్మేయడంతో 200మీటర్ల దిగువకు పడిపోయింది విజిబులిటీ. మంచుతో ఆ ప్రాంతాలన్నీ శ్వేతవర్ణంతో మెరిసిపోతున్నాయి. అటు కశ్మీర్‌లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. శ్రీనగర్‌లో సున్నా డిగ్రీ సెల్సియస్, పహల్గామ్‌లో మైనస్ 2.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఉత్తరాఖండ్‌ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. చార్‌ధామ్‌లో భారీ మంచు కురుస్తోంది. పవిత్ర కేదార్‌నాథ్‌ క్షేత్రం పూర్తిగా మంచుతో నిండిపోయింది. ఆలయం సమీపంలోని అన్ని భవనాలు మంచుతో నిండిపోయాయి. చమోలీలో పర్వత ప్రాంతాల నుంచి ఒక్కసారిగా భారీ హిమపాతం దూసుకొచ్చింది.

ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో హిమపాతం వణికిస్తోంది. రహదారులపై ఎక్కడ చూసినా మంచు పేరుకుపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. జమ్ములో మరో 24 గంటల పాటు తేలికపాటు మంచు వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..