హంపి విహారయాత్రలో విషాదం.. తుంగభద్రలో తల్లి, కూతురు మృతి!
హంపి విహారయాత్రలో తల్లి, కూతురు తుంగభద్ర నదిలో మునిగి మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. సులేకేరి గ్రామానికి చెందిన షాహిన్ (38), యాస్మిన్ (13) నదిలో స్నానం చేస్తుండగా లోతు ఎక్కువగా ఉండటంతో, ఈత రాక మృతి చెందారు. విహారయాత్ర కాస్తా విషాదయాత్రగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నదులు, జలాశయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

హంపి అందాలను చూడాలని వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని విషాదం ఎదురైంది. విహారయాత్ర కాస్తా విషాదయాత్రగా మారింది. తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తు మునిగి తల్లి, కూతురు మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని హంపి సమీపంలో చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం సులేకేరి గ్రామానికి చెందిన షాహిన్ (38), ఆమె కుమార్తె యాస్మిన్ (13) చికెన్ వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. శ్రావణమాసం కావడంతో కొంత విరామం తీసుకుని హంపి విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం (ఆగస్టు 21)తుంగభద్ర డ్యామ్‌ను సందర్శించి, అనంతరం హంపికి చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు.
శనివారం (ఆగస్టు 22) ఉదయం తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు తల్లి, కూతురు నీటిలోకి దిగారు. ఈ క్రమంలో యాస్మిన్ నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించిన తల్లి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే నది లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీటిలో చిక్కుకున్నారు. వారికి ఈత రాకపోవడంతో ప్రమాదం నుంచి బయటపడలేకపోయారు.
సమాచారం అందుకున్న అధికారులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టి తల్లి, కూతురి మృతదేహాలను వెలికితీశారు. విహారయాత్ర కోసం వెళ్లిన ఇద్దరూ మృతిచెందడంతో సులేకేరి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నదులు, జలాశయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
