AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై తగ్గేదేలే.. నెక్స్ట్ ప్లాన్ అదేనా..? సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 50 శాతం పరిమితిని ప్రస్తావిస్తూ హైకోర్టు 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది. అయితే వెనక్కి తగ్గేది లేదంటున్న ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తదుపరి న్యాయపోరాటంపై ఆసక్తి నెలకొంది.

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై తగ్గేదేలే.. నెక్స్ట్ ప్లాన్ అదేనా..? సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది?
Ap Bc Reservation
Shaik Madar Saheb
|

Updated on: Oct 02, 2026 | 10:20 AM

Share

స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు హైకోర్టు తెరదించింది. ఆరు వారాల్లోపు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలిచ్చింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన రెండు జీవోలను ధర్మాసనం రద్దు చేసింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని స్పష్టం చేసింది. అయినా తగ్గదేలే అన్నట్టు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకెళ్తామంటోంది. మరి సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది…? ప్రభుత్వ వాదనలెలా ఉండబోతున్నాయి..? కోర్టు తీర్పు, ప్రభుత్వతీరుపై విపక్షాల రియాక్షన్‌ ఏంటి..?

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 105, 1065 రెండు జీవోలను కొట్టేసింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం 50 శాతం కంటే మించి రిజర్వేషన్లు ఉండకూడదని పేర్కొంది. బీసీల జనాభా లెక్కలను చేపట్టి, రిజర్వేషన్లు ఖరారు చేశాకే ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిల్‌పై జోక్యానికి హైకోర్టు ద్విసభ్య బెంచ్ నిరాకరించింది. అలాగే… పంచాయతీ ఎన్నికల్లో బీసీలను ఉపవర్గీకరించి రిజర్వేషన్లు నిర్ణయించాలంటూ వేసిన పిల్‌నూ తోసిపుచ్చింది. గ్రామపంచాయతీల పాలనను ప్రత్యేక అధికారులకు అప్పగించడాన్ని సవాలు చేస్తూ వేసిన వ్యాజ్యాన్ని కూడా హైకోర్టు తిరస్కరించింది. అంతేకాదు… ఏపీ మున్సిపాల్టీ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది న్యాయస్థానం.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల విషయంమై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటోంది ఏపీ ప్రభుత్వం. రిజర్వేషన్లు సాధించేవరకు విశ్రమించేది లేదంటూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయిచింది. ఈ అంశంపై తక్షణమే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అధికారులను ఆదేశించారు. రిజర్వేషన్లు పెరగకూడదని కోర్టులో వైసీపీ వాదించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లను ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా… బీసీలను అండగా నిలబడే బాధ్యత ఏపీ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు చంద్రబాబు.

34 శాతం బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై వైసీపీ అధినేత జగన్‌ స్పందించారు. బీసీలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని జగన్‌ డిమాండ్‌ చేశారు.బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.చెల్లని జీవోలతో బీసీలను మభ్యపెట్టారనీ, కోర్టుల్లో నిలబడదని తెలిసి 44 రోజులుగా నాటకమాడారని జగన్‌ తప్పుబట్టారు.రాజ్యాంగబద్ధంగా 34శాతం రిజర్వేషన్లు తేవాలనీ, కేంద్రాన్ని ఒప్పించి చట్ట సవరణ చేయాలని జగన్‌ ట్వీట్‌లో డిమాండ్‌ చేశారు. బీసీలపై ప్రేమ మాటల్లో కాదు..చేతల్లో చూపాలన్నారు.తాము 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామనీ, 11 రాజ్యసభ స్థానాల్లో 4 బీసీలకు ఇచ్చామనీ చెప్పారు.బీసీల కోసం తాము చేసిన చట్టం అమలు చేయాలని జగన్ డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు చేతిలో బీసీలు మరోసారి మోసపోవద్దన్నారు మాజీమంత్రి బొత్స సత్యనారాయణ. రిజర్వేషన్లు 50శాతం దాటొద్దని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ఈ అంశంలో మళ్లీ కోర్టుకు వెళ్తామనడం మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు.

మొత్తంగా… హైకోర్టు తీర్పుతో 34 శాతం బీసీ రిజర్వేషన్లకు బ్రేక్ పడినా… వెనక్కి తగ్గేది లేదంటోంది ప్రభుత్వం. సుప్రీంకోర్టులో తదుపరి న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. మరోవైపు… హైకోర్టు తీర్పుతో ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో సుప్రీంకోర్టు ఏం చెబుతుంది..? 34 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వ వాదనలను సమర్థిస్తుందా..? లేక 50 శాతం పరిమితినే కొనసాగిస్తుందా..? అన్నది ఉత్కంఠగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us