ఫ్లైదుబాయ్ విమాన ఘటన బాధ్యులని తేలితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయిః ట్రంప్
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో కో-పైలట్ దాడి చేశాడు. కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సౌదీ అరేబియాకు మళ్లించి ప్రయాణికులను రక్షించారు. ఈ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు జరుగుతోంది, దీని వెనుక ఇరాన్ ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. కెప్టెన్ ధైర్యాన్ని ప్రపంచ దేశాలు ప్రశంసించాయి.

దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073లో జరిగిన ఘటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. సెప్టెంబర్ 30న ప్రయాణిస్తున్న ఈ విమానంలో కో-పైలట్, భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై దాడి చేసి కాక్‌పిట్ నియంత్రణను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినట్లు ఇజ్రాయెల్, సౌదీ అధికారులు వెల్లడించారు. దాడిలో కెప్టెన్ గాయపడినప్పటికీ, ఆయన కాక్‌పిట్ తలుపు తెరిచి సహాయం కోసం అప్రమత్తం చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది జోక్యం చేసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి దారి మళ్లించారు.
ఈ ఘటనలో విమానం కొద్దిసేపట్లోనే వేల అడుగుల ఎత్తు కోల్పోయినట్లు విమాన ట్రాకింగ్ సమాచారం వెల్లడించింది. విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. దాడిని అడ్డుకోవడంలో కెప్టెన్ మచ్ఛార్ కీలక పాత్ర పోషించడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా ప్రపంచ దేశాధినేతలు ఆయన ధైర్యాన్ని ప్రశంసించారు.
ఇదిలా ఉండగా.. ఈ ఘటన వెనుక ఇరాన్ ప్రమేయం ఉందా అనే కోణంలోనూ చర్చ మొదలైంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం కో-పైలట్‌కు ఇరాన్‌తో సంబంధాలు ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఇరాన్ ప్రమేయం నిర్ధారణ అయితే అమెరికా తీవ్రంగా స్పందిస్తుందని హెచ్చరించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ఇప్పటివరకు స్వతంత్ర నిర్ధారణ లేదు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం కో-పైలట్‌కు ఇరాన్‌తో సంబంధాలను ఇప్పుడే నిర్ధారించలేమని తెలిపారు. ఘటనకు సంబంధించిన దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని చెప్పారు. ఇజ్రాయెల్ అధికారులు కో-పైలట్ ఉద్దేశాలు, భావజాలం, సాధ్యమైన సహచరులు, ముందస్తు ప్రణాళిక వంటి అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు.
ప్రాథమిక సౌదీ దర్యాప్తులో కో-పైలట్ కెప్టెన్‌పై దాడి చేసినట్లు నిర్ధారణ కాగా, దాడి వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది ఇంకా తేలాల్సి ఉంది. దర్యాప్తులో భాగంగా సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం కెప్టెన్ స్మి్త్ మచ్ఛార్ పరిస్థితి నిలకడగా ఉంది. ఇరాన్ లింక్‌పై దర్యాప్తు కొనసాగుతున్నందున, ఈ అంశంపై తుది నిర్ధారణకు రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
