AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు.. 8 మంది మృతి, 15 మందికి పైగా గాయాలు

గుజరాత్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. అహ్మదాబాద్‌లో నగరంలో శనివారం (జూలై 18) మహమూద్‌పురా ప్రాంతం గేట్‌రోడ్ రోడ్డులో ఉన్న టాలెంట్ ఫైర్‌వర్క్స్ బాణసంచా కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వరుస పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల తీవ్రతతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి.

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు.. 8 మంది మృతి, 15 మందికి పైగా గాయాలు
Ahmedabad Firecracker Factory Fire
Balaraju Goud
|

Updated on: Jul 18, 2026 | 5:43 PM

Share

గుజరాత్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. అహ్మదాబాద్‌లో నగరంలో శనివారం (జూలై 18) మహమూద్‌పురా ప్రాంతం గేట్‌రోడ్ రోడ్డులో ఉన్న టాలెంట్ ఫైర్‌వర్క్స్ బాణసంచా కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వరుస పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల తీవ్రతతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 15 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖకు చెందిన అనేక ఫైర్ టెండర్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించాయి. అదే సమయంలో సహాయక బృందాలు ఫ్యాక్టరీలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చి సమీప ఆసుపత్రులకు తరలించాయి. గాయపడిన వారిలో ఐదుగురికి ఎల్జీ ఆసుపత్రిలో, మరో నలుగురికి సివిల్ ఆసుపత్రిలో చికిత్స అందుతుండగా, మిగిలిన వారిని ఇతర వైద్యశాలల్లో చేర్చి వైద్యం కొనసాగిస్తున్నారు.

స్థానికుల కథనం ప్రకారం అగ్నిప్రమాదం ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుళ్ల శబ్దాలు దూర ప్రాంతాల వరకు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఫ్యాక్టరీని మెహుల్ దోడియా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రత దృష్ట్యా అహ్మదాబాద్ మేయర్, మున్సిపల్ కమిషనర్, పలువురు సీనియర్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పోలీసులు పరిసర ప్రాంతాలను దిగ్బంధించి భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. షార్ట్‌సర్క్యూట్‌, భద్రతా నిబంధనల ఉల్లంఘన లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం ప్రమాదానికి కారణమైన అంశాలు, బాధ్యులపై చర్యలు ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు, శిథిలాల మధ్య మరెవరైనా చిక్కుకుని ఉన్నారా అనే దానిపై గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us