వైద్యుల నిర్లక్ష్యంతో ఆరేళ్ల బాలుడు బలి..న్యాయం కోసం తల్లిదండ్రుల ఆందోళన.. ఏం జరిగిందంటే..
గ్రేటర్ నోయిడాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం 6 ఏళ్ల పసివాడి ప్రాణాన్ని బలిగొంది. MRI స్కాన్‌కు ముందు అధిక మోతాదులో మత్తు మందు ఇవ్వడం వల్ల బాలుడు మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం వారు పోరాడుతున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా నిరసనలకు దారి తీసింది, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగవుతుందని నమ్మిన ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలింది. అభం శుభం తెలియని ఆ పసివాడి ఊపిరి ఆగింది. అధిక మోతాదులో మత్తు మందు ఇవ్వడంతో చిన్నారి మృతి చెందగా.. ఆ కుటుంబం బాధ అంతా ఇంతా కాదు. విషాదకరమైన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
తప్పుడు ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఓ ఆరేళ్ల బాలుడు మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తమ బిడ్డ గర్వ్ కసానా MRI స్కాన్ కోసం కుటుంబ సభ్యులు సెక్టార్ P3లోని KB హెల్త్‌కేర్‌కు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆ ఆరోగ్య సంరక్షణ కేంద్రంలోని సిబ్బంది చికిత్స నిమిత్తం ఆ చిన్నారికి మత్తు మందు అందించారు. కాసేపాటికీ చిన్నారి మరణించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. అధిక మోతాదులో మత్తు మందు ఇవ్వడం వల్లే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధిత కుటుంబానికి మద్దతుగా స్థానిక భారతీయ కిసాన్ యూనియన్ రైతు నాయకుడు పవన్ ఖతానా ఆధ్వర్యంలో రైతు నాయకులు హెల్త్ కేర్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ప్రజల ప్రాణాల పట్ల, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఇలాంటి సిబ్బంది, హెల్త్ కేర్ సెంటర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి దిగజారడంతో సెక్టార్ P-3లోని KB సెంటర్‌లో ఉన్న ఆసుపత్రిని తాత్కాలికంగా మూసివేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




