ఇంతకాలానికి జ్ణానోదయమైనట్టుంది
ఇంతకాలానికి సర్కారోళ్లకి జ్ణానోదయమైనట్టుంది. ప్రజా సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చుపెట్టకూడదన్న ఇంగితానికి వచ్చారు. తొంబైశాతం పైచిలుకున్న పేద, మధ్య తరగతి ప్రజలకు దర్శనమైన ఇవ్వని సర్కారీ ముద్రణలపై..
ఇంతకాలానికి సర్కారోళ్లకి జ్ణానోదయమైనట్టుంది. ప్రజా సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చుపెట్టకూడదన్న ఇంగితానికి వచ్చారు. తొంబైశాతం పైచిలుకున్న పేద, మధ్య తరగతి ప్రజలకు దర్శనమైన ఇవ్వని సర్కారీ ముద్రణలపై ఇక చెల్లుచీటికి మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. దేశం తీవ్ర ఆర్థిక మందగమనంలో ఉన్న వేళ పొదుపుచర్యలపై ఆసక్తి చూపుతోంది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, విభాగాల్లో డైరీలు, గ్రీటింగ్ కార్డులు, కాఫీ టేబుల్ బుక్స్, క్యాలెండర్లను భౌతిక రూపంలో ముద్రించడాన్నినిషేధించింది. ఫలితంగా ఇకపై ఏ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులు, ప్రభుత్వంలోని అన్ని ఇతర విభాగాల్లో వాల్ క్యాలెండర్లు, డెస్క్‌టాప్ క్యాలెండర్లు, డైరీలు ఇతర వస్తువులను ముద్రించకూడదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడంతోపాటు ఆర్థిక పొదుపు చర్యల కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవాళ బుధవారం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఇపుడు ఇవన్నీ డిజిటల్ రూపును సంతరించుకోనున్నాయి. మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వయంప్రతిపత్త సంస్థలతో పాటు, ఇతర ప్రభుత్వ రంగ విభాగాలన్నింటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. తక్షణమే అమల్లోకి వస్తాయి.