NEET UG 2024 Paper Leak: ‘పరీక్ష ముందు రోజు రాత్రే మాకు నీట్ యూజీ క్వశ్చన్ పేపర్ అందింది..’ నేరం అంగీకరించిన విద్యార్థులు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2024 పరీక్షలో అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. బిహార్‌లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు వచ్చిన వార్తలను గతవారం కేంద్ర విద్యాశాక, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. లీకేజీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని ఆరోపణలు కొట్టిపారేసింది. ప్రతి పక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నట్లు..
న్యూఢిల్లీ, జూన్ 21: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) యూజీ 2024 పరీక్షలో అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. బిహార్‌లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు వచ్చిన వార్తలను గతవారం కేంద్ర విద్యాశాక, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. లీకేజీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని ఆరోపణలు కొట్టిపారేసింది. ప్రతి పక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించాయి. అయితే, పేపర్ లీక్ నిజమేనని ఆధారాలతో సహా బయటికొచ్చింది. పరీక్ష ముందురోజు రాత్రే నీట్ ప్రశ్నపత్రం జవాబులతో సహా తమకు అందిందని బిహార్‌లో అరెస్టయిన నలుగురు పోలీసులకు వెల్లడించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపుతోంది.
బీహార్‌లో అరెస్టయిన నలుగురు విద్యార్ధుల్లో అభిలాషి అనురాగ్ యాదవ్, అతని మామ దానాపూర్ మున్సిపల్ కౌన్సిల్‌లో జూనియర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న సికందర్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్ధులు నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. కోటాలోని కోచింగ్ హబ్‌లో పరీక్షకు సిద్ధమవుతున్న అనురాగ్ యాదవ్‌కు అతని మామ సికందర్ ఫోన్ చేసి పేపర్ లీక్ చేసేందుకు ప్లాన్ చేశానని, వెంటనే ఇంటికి రావాలని కోరాడు. వెంటనే మామవద్దకు చేరుకున్న అనురాగ్ యాదవ్ రాత్రికి రాత్రే జవాబులను చదివి కంఠస్థం చేశాడు. మరుసటి రోజు పరీక్ష కేంద్రానికి వెళ్లిన అనురాగ్ యాదవ్‌కు సరిగ్గా కంఠస్థం చేసిన ప్రశ్నలే రావడంతో అన్ని సమాధానాలు రాశాడు. అనురాగ్‌తోపాటు అతని స్నేహితులు నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ అనే మరో ఇద్దరు విద్యార్ధులకు కూడా సికిందర్ పేపర్ అందించాడు. వీరు నీట్ క్లియర్ చేయడానికి ఒక్కొక్కరి నుంచి రూ.30 నుంచి 32 లక్షల వరకు వసూలు చేసినట్లు నిందితులు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించడంతోపాటు.. ఇదే విషయాన్ని రాత పూర్వకంగా రాసిచ్చారు. దీంతో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం మరింత తీవ్రమైంది.
కాగా నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 14 మందిని అరెస్టు చేశారు. మరోవైపు నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. రిగ్గింగ్, పేపర్ లీకేజీలు, అవినీతిపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఏకిపారేస్తున్నాయి. ‘బీజేపీ పాలిత రాష్ట్రాలు పేపర్ లీకేజీకి కేంద్రంగా ఉన్నాయని’ అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.