AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sundar Pichai: సుందర్ పిచై ఇల్లు అమ్మకం.. భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్న తండ్రి..!

గూగుల్ సీఈవో సుందర్ పిచై పూర్వీకుల ఇల్లు చెన్నై అశోక్‌ నగర్‌లో ఉంది. సుందర్ పుట్టి పెరిగిన ఆ ఇల్లు అమ్మకానికి ఉందని తెలిసిన వెంటనే తమిళ నిర్మాత మణికండన్ దాన్ని కొనేందుకు ముందుకు వచ్చారు. సుందర్ తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి.. ఆ ఇంటిని తన సొంతం చేసుకున్నారు.

Sundar Pichai: సుందర్ పిచై ఇల్లు అమ్మకం.. భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్న తండ్రి..!
Google CEO Sundar Pichay
Janardhan Veluru
|

Updated on: May 20, 2023 | 2:57 PM

Share

పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన చెన్నైలోని తన ఇంటిని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచై విక్రయించారు. తమిళ సినీ నటుడు, నిర్మాత సి.మణికండన్ ఈ ఇంటిని కొనుగోలు చేశారు. సుందర్ పూర్వీకుల ఇల్లు చెన్నై అశోక్‌ నగర్‌లో ఉంది. సుందర్ పుట్టి పెరిగిన వారి పూర్వీకుల ఇల్లు అమ్మకానికి ఉందని తెలిసిన వెంటనే మణికండన్ దాన్ని కొనేందుకు ముందుకు వచ్చారు. సుందర్ తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి.. ఆ ఇంటిని తన సొంతం చేసుకున్నారు. సుందర్ పిచై నివసించిన ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయడం తన జీవితంలో గర్వించదగ్గ విజయమని మణికండన్ పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మణికండన్.. ఇప్పటి వరకు తాను 300 ఇళ్లను నిర్మించినట్లు తెలిపారు.

ఇంటి స్థలం కొనుగోలుకు సంబంధించి లావాదేవీలు సాగుతోన్న సమయంలో సుందర్‌ తల్లిదండ్రులు ఎంతో మర్యాద ఇచ్చాయని కొనియాడారు. సుందర్ తల్లి స్వయంగా ఫిల్టర్ కాఫీ చేసి ఇచ్చారని.. ఆయన తండ్రి రఘునాథ పిచై మొదటి సమావేశంలోనే ఆస్తికి సంబంధించిన పత్రాలను అందజేసినట్లు గుర్తుచేశారు. వారి వినయపూర్వక వ్యవహార శైలి తనను ఆశ్చర్యానికి గురిచేసినట్లు ది హిందు బిజినెస్ లైన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సుందర్‌ తండ్రి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గంటల తరబడి వేచి ఉన్నారని.. పత్రాలు ఇవ్వడానికి ముందు అవసరమైన అన్ని పన్నులు చెల్లించారని మణికందన్ తెలిపారు. తమ మొదటి ఆస్తి కావడంతో.. పత్రాలను అందజేసేటప్పుడు సుందర్ తండ్రి భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారని తెలిపారు. పాత ఇల్లు కావడంతో దాన్ని కూల్చేందుకు అయ్యే ఖర్చులను కూడా సుందర్ తండ్రే భరించారు.

ఇవి కూడా చదవండి

సుందర్ చెన్నైలోనే పుట్టిపెరిగారు. 1989లో ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లారు. సుందర్‌ తన 20 ఏళ్ల వరకు చెన్నై అశోక్ నగర్లోని ఆ ఇంట్లోనే ఉన్నారని స్థానికులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో చెన్నైలో పర్యటించినప్పుడు ఈ ఇంటిని సుందర్ సందర్శించారు. సెక్యూరిటీ గార్డులకు ఇంటి గృహోపకరణాలు అందజేశారు. కొంత డబ్బును కూడా ఇచ్చారు. బాల్కనీలో నిల్చొని ఫోటోలు కూడా తీసుకున్నట్టు స్థానికులు గుర్తుచేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..