ఉగ్రవాదుల నుంచి ఆర్థిక నేరగాళ్ల వరకు మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో వారే టాప్
భారత ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో జరిగిన ఉగ్రవాదుల మారణహోమంలో తహవ్వూర్ హుస్సెన్ రాణా పాత్రను న్యాయస్థానాలు నిర్థారించి దోషిగా తేల్చాయి. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడియన్ వ్యాపారవేత్త రాణా, 160 మందికి పైగా బలితీసుకున్న ముంబై దాడుల్లో పాత్రధారి. పాకిస్తాన్ సైన్యంలో వైద్యుడిగా పనిచేసిన..

విదేశాల్లో తలదాచుకుంటున్న భారతదేశ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో మారణహోమాలు సృష్టించిన ఉగ్రవాదుల నుంచి వేలకోట్లు కాజేసిన ఘరానా ఆర్థిక నేరగాళ్ల వరకు జాబితా పెద్దగానే ఉంది. వారిలో మూడింట ఒక వంతు మంది అగ్రరాజ్యం అమెరికాలోనే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రకటించింది. ఆ దేశం “నేరస్థుల స్వర్గధామం”గా మారిందంటూ గత నెలలో తీవ్ర అసహనంతో కూడిన ప్రకటన కూడా చేసింది. అయితే ఇప్పుడు అమెరికాలో మారిన అధ్యక్షుడి ప్రభావమూ.. మరే కారణమో.. అక్రమ వలసదారులతో పాటు తమ దేశంలో తలదాచుకుంటున్న నేరగాళ్ల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితిని అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్న భారత ప్రభుత్వం.. ఆ దేశంలో దర్జాగా తిరుగుతున్న ముంబై ఉగ్ర దాడి కేసు దోషి తహవ్వూర్ హుస్సేన్ రాణా సహా మరికొందరిని వెనక్కి రప్పించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. పనిలో పనిగా అమెరికా మాత్రమే కాదు, ఇతర పశ్చిమ దేశాలకు పారిపోయి తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను సైతం వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆయా దేశాలతో ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందాలతో పాటు రాయబార ప్రయత్నాలతో వారిని వెనక్కి రప్పించేందుకు దాదాపు ఒక యుద్ధమే చేస్తుందని చెప్పవచ్చు. ఆ జాబితాలో ప్రాధాన్యతాక్రమంలో మొదటి 5 స్థానాల్లో ఎవరున్నారంటే..?
తహవ్వూర్ హుస్సేన్ రాణా
2008లో భారత ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో జరిగిన ఉగ్రవాదుల మారణహోమంలో తహవ్వూర్ హుస్సెన్ రాణా పాత్రను న్యాయస్థానాలు నిర్థారించి దోషిగా తేల్చాయి. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడియన్ వ్యాపారవేత్త రాణా, 160 మందికి పైగా బలితీసుకున్న ముంబై దాడుల్లో పాత్రధారి. పాకిస్తాన్ సైన్యంలో వైద్యుడిగా పనిచేసిన రాణాకు 2008 దాడుల గురించి ముందే తెలుసు. అలాగే డెన్మార్క్‌లో ఉగ్రవాద కుట్ర అభియోగాలపై 2009లో రాణాను అరెస్టు చేశారు. ఈ కేసుతో పాటు, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)కు అన్ని రకాలుగా సహకరిస్తున్నాడన్న అభియోగాలపై ఆధారాలతో సహా విచారణ జరిపిన న్యాయస్థానాలు దోషిగా తేల్చాయి. ఇప్పుడు తాజాగా అమెరికాలోని సుప్రీంకోర్టు కూడా రాణా దరఖాస్తును తిరస్కరించడం ద్వారా అతణ్ణి భారత్‌కు అప్పగించేందుకు లైన్ క్లియర్ చేసింది.
రాణాకు సంబంధించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చదవండి
అర్ష్ దల్లా
నిషేధిత వేర్పాటువాద సంస్థ “ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్” నేత, ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్‌దీప్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ దల్లా కెనడాలో స్థిరపడ్డాడు. హత్య, హత్యాయత్నం, దోపిడీ, ఉగ్రవాద చర్యలకు సంబంధించి 50 కి పైగా కేసుల్లో అతడు భారతదేశానికి మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. జనవరి 2004లో అతన్ని “ఉగ్రవాది”గా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ISIతో అర్ష్ దల్లాకు సంబంధాలు ఉన్నాయి. ఒక దాడిలో గాయపడిన తర్వాత దల్లాను గత అక్టోబర్‌లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి దల్లాను భారత్‌కు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ డిసెంబర్‌లో అతనికి బెయిల్ లభించింది.
అన్మోల్ బిష్ణోయ్
గుజరాత్‌లోని జైలులో ఉండి బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో భయంకరమైన నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్న లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడే అన్మోల్ బిష్ణోయ్. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా, మహారాష్ట్ర రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్యలతో సహా అనేక హై ప్రొఫైల్ కేసులకు సంబంధించి అతను భారతదేశంలో వాంటెడ్‌గా ఉన్నాడు. అన్మోల్ తప్పుడు పత్రాలతో దేశం విడిచి పారిపోయి అమెరికా చేరుకున్నాడు. దొంగ పత్రాలతో అక్కడికి చేరుకున్న అన్మోల్‌ను గత నవంబర్‌లో అమెరికాలో అరెస్టు చేశారు. ఢిల్లీ నుండి కస్టడీ అభ్యర్థన ఉన్నప్పటికీ అతన్ని త్వరగా రప్పించే అవకాశం భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయితే దౌత్యపరమైన ప్రయత్నాలు మాత్రం ముమ్మరమయ్యాయి.
విజయ్ మాల్యా
రూ.9,000 కోట్లకు పైగా రుణ ఎగవేత కేసును ఎదుర్కొంటున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యా 2016లో భారతదేశం విడిచి వెళ్లి ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో ఉన్నాడు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కుప్పకూలిన తర్వాత ఆర్థిక మోసాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై భారత దర్యాప్తు సంస్థలు ఆయన కోసం గాలిస్తున్నారు. 2019లో ఆయనను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించారు. మాల్యా కస్టడీ కోసం భారతదేశం సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తోంది. ఇది త్వరలో ముగిసే అవకాశం లేదు. ఇదిలా ఉంటే సీబీఐ కోర్టు గత ఏడాది రూ.180 కోట్ల రుణ ఎగవేత కేసులో ఆయనపై కొత్త నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
నీరవ్ మోదీ
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నుంచి తీసుకున్న రూ.14,000 కోట్ల రుణాన్ని చెల్లించకుండా ఎగవేసిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన మామ మెహుల్ చోక్సీ కీలక నిందితులు. ఈ మోసానికి బ్యాంకు అధికారులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ వారిద్దరిపై దర్యాప్తు జరుగుతోంది. నీరవ్ మోదీ 2018లో దేశం విడిచి వెళ్లి అదే సంవత్సరం లండన్‌లో అరెస్టు అయ్యాడు. ప్రస్తుతం యూకే జైలులో ఉన్న ఆయన తనను భారత్‌కు అప్పగించవద్దు అని కోరుతూ అక్కడి న్యాయస్థానాల్లో దాఖలు చేసిన అన్ని కేసుల్లోనూ ఓడిపోయారు. మరోవైపు మెహుల్ చోక్సీ ఇప్పుడు ఆంటిగ్వాలో ఉన్నాడు.
ఈ ఐదుగురే కాదు.. వీరితో పాటు ఇంకా చాలామంది భారత్‌లో నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయారు. వారిని వెనక్కి రప్పించేందుకు ఉన్న అన్ని అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ జాబితాలో ఆయుధ ఒప్పంద సలహాదారు సంజయ్ భండారి ఉన్నారు. ఆయన పన్ను ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్‌ను వెనక్కి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. 2023లో దుబాయ్‌లో అరెస్టు అయ్యాడు. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రకర్‌ను వెనక్కి రప్పించేందుకు భారత్ ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతోంది. భారత ప్రభుత్వ ప్రయత్నాలతో ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచినట్టు కథనాలు వచ్చాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
