Forgery Case: నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో నిందితుడికి 383 ఏళ్లు జైలు శిక్ష, రూ.3 కోట్ల జరిమాన
ఈ మధ్య కేటుగాళ్లు నకిలీ పత్రాలు తయారుచేస్తూ లక్షలు కాజేస్తున్న ఘటనలు ఎక్కవగా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వీరి బుద్ధి మాత్రం మారడం లేదు. ఎలాగైన డబ్బులు సంపాదించాలనే ఆశతో ఇలాంటి దుష్చర్యలకు పాల్పడుతున్నారు.

ఈ మధ్య కేటుగాళ్లు నకిలీ పత్రాలు తయారుచేస్తూ లక్షలు కాజేస్తున్న ఘటనలు ఎక్కవగా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వీరి బుద్ధి మాత్రం మారడం లేదు. ఎలాగైన డబ్బులు సంపాదించాలనే ఆశతో ఇలాంటి దుష్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా నకీలీ పత్రాలు తయారుచేసి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తిపై తమిళనాడులోని కోయంబత్తూర్ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి ఏకంగా 383 ఏళ్ల జైలుశిక్షను విధించింది. అలాగే దీంతో పాటు రూ.3.32 కోట్ల జరిమానాను కూడా విధించింది. ఇక వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని కోయంబత్తూర్ డివిజన్‌లో జరిగిన ఆర్టీసీ బస్సుల వేలంలో అక్రమాలు జరిగాయని 1988 నవంబర్ 9న ఫిర్యాదు వచ్చింది. ఆర్టీసీ సంస్థకు చెందిన 47 బస్సులను నకీలీ పత్రాలతో విక్రయించి దాదాపు 28 లక్షల రూపాయలు మోసం చేశారని 8 మంది ఉద్యోగులపై ఉన్నత అధికారులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అప్పట్లోనే చేరన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అసిస్టెంట్ కోదండపాణి, డిప్యూటీ మేనేజర్ రామచంద్రన్, నటరాజన్, రంగనాథన్, రాజేంద్రన్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కేసులో విచారణ జరుగుతూనే ఉంది.
కానీ ఈలోపే రామచంద్రన్, రంగనాథన్, నటరాజన్, రాజేంద్రన్‌లు మృతి చెందారు. అయితే ఇందుకు సంబంధించిన కేసు తీర్పును శుక్రవారం న్యాయస్థానం వెల్లడించింది. కోదండపాణి తప్ప మిగిలిన ముగ్గురుని జడ్జి శివకుమార్ నిర్దోషులుగా పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థను మోసం చేసినట్లు కోదండపాణిని దోషిగా తేల్చి కఠినమైన శిక్షను విధించారు. కోదండపాణికి 47 నేరాల కింద నాళుగేళ్ల చొప్పున188 సంవత్సరాలు.. అలాగే 47 ఫోర్జరీకి సంబంధించిన నేరాలకు నాలుగేళ్ల చొప్పున మరో 188 ఏళ్లు, ఇంకా ప్రభుత్వ ఆస్తులను దోచుకున్నందుకు మరో ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. వీటిని మొత్తం కలిపితే 383 సంవత్సరాలు అవుతుంది. మరో విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ నిందితుడి వయసు 82 సంవత్సరాలు. అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని ఏడు సంవత్సరాల జైలు శిక్షను ఏకకాలంలో అనుభవించాలని కోర్టు తీర్పునిచ్చింది.




