AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్‌ ఫోర్స్ కీలక నిర్ణయం.. 62 ఏళ్లు సుదీర్ఘ సేవలు అందించిన మిగ్-21 గుడ్ బై!

సుమారు 62 సంవత్సరాల పాటు సేవలు అందించిన మిగ్-21కి 2025 సెప్టెంబర్ 19న చండీగఢ్ ఎయిర్‌బేస్‌లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో అధికారికంగా వీడ్కోలు పలకనున్నారు. ఈ కార్యక్రమంలో వైమానిక దళ అధికారులు, మిగ్-21 పైలట్లు, పలువురు మాజీ యుద్ధ వీరులు పాల్గొనే అవకాశం ఉంది..

ఎయిర్‌ ఫోర్స్ కీలక నిర్ణయం.. 62 ఏళ్లు సుదీర్ఘ సేవలు అందించిన మిగ్-21 గుడ్ బై!
Fighter jet MiG-21
Mahatma Kodiyar
| Edited By: Srilakshmi C|

Updated on: Jul 22, 2025 | 9:30 PM

Share

భారత వైమానిక దళం (IAF)లో కీలక పాత్ర పోషిస్తూ సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన సూపర్‌సోనిక్ యుద్ధ విమానం మిగ్-21 ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోనుంది. రక్షణశాఖ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 62 సంవత్సరాల పాటు సేవలు అందించిన మిగ్-21కి 2025 సెప్టెంబర్ 19న చండీగఢ్ ఎయిర్‌బేస్‌లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో అధికారికంగా వీడ్కోలు పలకనున్నారు. ఈ కార్యక్రమంలో వైమానిక దళ అధికారులు, మిగ్-21 పైలట్లు, పలువురు మాజీ యుద్ధ వీరులు పాల్గొనే అవకాశం ఉంది. 1963లో భారత వైమానిక దళంలో తొలిసారిగా మిగ్-21 చేరింది. అప్పటి నుంచి ప్రతి పెద్ద యుద్ధం, ఆపరేషన్‌లో భాగమైంది. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం, 1971లో బంగ్లాదేశ్ విముక్తి సంగ్రామం, 1999లో కార్గిల్ యుద్ధం, 2019లో బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్‌లో ఈ యుద్ధ విమానం తన సత్తా చాటింది.

మిగ్-21 భారత వైమానిక దళంలో చేరిన మొదటి సూపర్‌సోనిక్ యుద్ధ విమానం. 1960 – 70వ దశకంలో భారత్‌కు సాంకేతిక ఆధిపత్యాన్ని అందించింది. ఒక సమయంలో భారత్‌ వద్ద మిగ్-21 కుటుంబానికి చెందిన 850కి పైగా విమానాలు ఉండగా, వీటిలో 600కు పైగా హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) భారత్‌లోనే తయారు చేసింది. అయితే తర్వాతి సంవత్సరాల్లో సాంకేతికంగా పాతబడిన మిగ్-21 విమానాలు పలు ప్రమాదాలకు కారణమవడంతో ఈ ఫైటర్ జెట్ ‘ఫ్లయింగ్ కాఫిన్’ (ఎగిరే శవపేటిక) అనే అపప్రద మూటగట్టుకోవాల్సి వచ్చింది. అనేక మంది పైలట్లు ఈ విమానాన్ని నడుపుతూ ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ, ఈ విమానం అనేక పైలట్లకు శిక్షణ, యుద్ధ అనుభవంలో కీలక భాగంగా నిలిచింది.

ప్రస్తుతం మిగ్-21 స్థానంలో స్వదేశీ తేజస్ Mk-1A విమానాలు క్రమంగా చేరనున్నాయి. అయితే తేజస్ విమానాల డెలివరీలో జాప్యం కారణంగా మిగ్-21ను అనేక పర్యాయాలు కొనసాగించక తప్పలేదు. ఈ విమానానికి వీడ్కోలు పలకడంతో వైమానిక దళంలో యుద్ధ స్క్వాడ్రన్ల సంఖ్య కేవలం 29కి పడిపోతుంది, ఇది గత కొన్ని దశాబ్దాలలో అత్యల్పం. ఇంత సుదీర్ఘకాలం భారత వైమానిక దళంలో సేవలందించిన యుద్ధ విమానం మరేదీ లేదు. ఇది IAF చరిత్రలో మూడింట రెండు వంతుల కాలంగా లెక్కించవచ్చు. ప్రతి పైలట్ కెరీర్‌లో ఒక భాగంగా నిలిచింది. చండీగఢ్ ఎయిర్‌బేస్‌లో జరిగే వీడ్కోలు కార్యక్రమంలో మిగ్-21 ఫ్లై-పాస్ట్, స్టాటిక్ డిస్‌ప్లే కూడా ఉంటుందని సమాచారం. ఈ యుద్ధ విమానం భారత సైనిక చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. మిగ్-21 ఇక ఆకాశంలో ఎగరకపోయినా, దాని కథలు భారతదేశ ధైర్యం సాహసాలను చాటడంతో పాటు సాంకేతిక పురోగతిని రాబోయే తరాలకు గుర్తు చేస్తాయనడంలో సందేహం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.