అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగా పరుపులో అలికిడి..! ఏంటాని చూడగా గుండె గుభేల్..
ఓ ఇంటి ముందు కుక్కలు అదేపనిగా అరవసాగాయి. అలికిడి ఇంటి వరండాలో నిద్రిస్తున్న యువకుడికి మెలకువ వచ్చింది. ఇంతలొ తన పరుపు అదే పనిగా కదలడం చూశాడు. లైటు వేసి కాస్త దగ్గరికెళ్లి చూడగా అంతే.. పై ప్రాణాలు పైనే పోయినంత పనైంది..

మహబూబ్‌నగర్, జులై 22: పాము కనిపిస్తేనే.. కొందరు అల్లంత దూరాన ఎగిరిపడతారు. భయంతో వెనకా ముందు చూడకుండా పరుగు లంకించు కుంటారు. అలాంటి ఏకంగా ఏడు అడుగుల కొండ చిలువ గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో దూరి.. యువకుడు నిద్రిస్తున్న పరుపులోకి చొరబడింది. ఇంతలో ఇంటి ముందు కుక్కలు అదేపనిగా అరవసాగాయి. అలికిడి మెలకువ వచ్చిన యువకుడు తన పరుపు అదే పనిగా కదలడం చూశాడు. లైటు వేసి కాస్త దగ్గరికెళ్లి చూడగా అంతే.. పై ప్రాణాలు పైనే పోయినంత పనైంది. ఈ షాకింగ్ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు పట్టణంలోని చెలిమిళ్ల కాలనీలో సోమవారం (జులై 21) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు పట్టణంలోని చెలిమిళ్ల కాలనీలో పెళ్లూరు చెన్నకేశవులు అనే యువకుడు ఆదివారం రాత్రి తన ఇంటి వరండాలో పరుపు వేసుకుని చల్లగాలికి పడుకున్నాడు. అయితే తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఇంటి ముందు కుక్కలు అదేపనిగా అరవడం మొదలెట్టాయి. దీంతో నిద్రలేచిన చెన్నకేశవులు తన పరుపులో ఏదో కదులుతున్నట్టు గమనించాడు. వెంటనే లేచి లైటు వేసి కాస్త పరిశీలనగా చూడగా.. ప్రాణం పోయినంత పనైంది. పె..ద్ద.. కొండచిలువ తన పరుపులో ఉండటం చూశాడు. అంతే భయంతో గట్టిగట్టిగా కేకలు వేయడంతో.. ఇరుగు పొరుగు పరుగు పరుగున వచ్చారు. అలికిడి పాము పరుపులో నుంచి చిన్నగా మెట్ల కిందకు జారుకుంది.

Python
అక్కడికి వచ్చిన మల్లేశ్ అనే యువకుడు వెంటనే వనపర్తిలోని సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్‌కు సమాచారం అందించాడు. వెంటనే చిలుక కుమార్ సాగర్, అవినాశ్‌లతో కలిసి ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. వీరు చాకచక్యంగా 13 కిలోల బరువున్న ఏడు అడుగుల కొండచిలువను బంధించారు. తర్వాత పెద్దగూడెం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విజయ్ సమక్షంలో ఆ పామును విడిచిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలంలో పాములు నివాస ప్రాంతాల్లోకి వెచ్చదనం కోసం వచ్చే అవకాశం ఉందని, ఈ కాలంలో అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




