రోగులకు గుండె ఆపరేషన్లు చేసిన నకిలీ డాక్టర్.. ఒకే నెలలో ఏడుగురు మృతి!
ఓ నకిలీ డాక్టర్ పలువురు రోగుల జీవితాలతో ఆటలాడాడు. ఏకంగా వరుస గుండె ఆపరేషన్లు చేసి వారిని పొట్టనపెట్టుకున్నాడు. కేవలం నెల రోజుల్లోనే ఏడుగురికి ఆపరేషన్లు చేసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని దామో నగరంలోని ఒక ప్రైవేట్ మిషనరీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

భోపాల్, ఏప్రిల్ 5: ఓ నకిలీ డాక్టర్ పలువురు రోగుల జీవితాలతో ఆటలాడాడు. ఏకంగా వరుస గుండె ఆపరేషన్లు చేసి వారిని పొట్టనపెట్టుకున్నాడు. కేవలం నెల రోజుల్లోనే ఏడుగురికి ఆపరేషన్లు చేసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని దామో నగరంలోని ఒక ప్రైవేట్ మిషనరీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో ఎన్ జాన్ కెమ్ అనే వ్యక్తి క్రైస్తవ మిషనరీ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా చెలామణి అవుతున్నాడు. అదే పేరున్న ప్రసిద్ధ బ్రిటిష్ వైద్యుడిగా నటించి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. క్రిస్టియన్ మిషనరీ ఆసుపత్రిలో డాక్టర్‌గా చెలామణి అవుతూ పలువురు రోగులకు హార్ట్ సర్జరీలు కూడా చేశాడు. అయితే అతడు ఆపరేషన్ చేసిన రోగులంతా పిట్టల్లా చనిపోవడం ప్రారంభించారు. అతడి వద్ద గుండె ఆపరేషన్లు చేయించుకున్న రోగుల్లో ఒకే నెలలో ఏడుగురు మరణించారు. దీంతో ఆ డాక్టర్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో న్యాయవాది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా అధ్యక్షుడు దీపక్ తివారీ ఆ డాక్టర్‌పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. సర్జరీ తర్వాత మరణించిన రోగుల మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. నిందితుడి అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని తేలింది. న్యాయవాది, బాలల సంక్షేమ కమిటీ జిల్లా అధ్యక్షుడు దీపక్ తివారీ మాట్లాడుతూ.. అధికారిక మరణాల సంఖ్య 7 ఉంటే, వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నకిలీ డాక్టర్ బండారం బయటపడంతో ఆపరేషన్‌కు సిద్ధం ఉన్న పలువరు రోగులు భయంతో వేరే ఆస్పత్రికి వెళ్లిపోయినట్లు తెలిపారు. నిందితుడు నరేంద్ర యాదవ్‌పై హైదరాబాద్‌లో కూడా ఒక కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
ఆయుష్మాన్ భారత్ పథకం కింద మిషనరీ ఆసుపత్రికి ప్రభుత్వం నుంచి డబ్బు కూడా అందుతోందని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనూంగో అన్నారు. మిషనరీ ఆసుపత్రిలో రోగులకు నకిలీ వైద్యుడు శస్త్రచికిత్స చేస్తున్నట్లు ఫిర్యాదు అందిందని, దీనిని తీవ్రమైన కేసుగా పరిగణించి చర్యలు చేపడుతామని కనూంగో పేర్కొన్నారు. జిల్లా దర్యాప్తు బృందం సదరు ఆసుపత్రి నుంచి అన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది. దర్యాప్తులో నకిలీ వ్యక్తి ప్రముఖ బ్రిటిష్ వైద్యుడి మాదిరిగానే నకిలీ పత్రాలను సృష్టించినట్లు వెల్లడైంది. నిందితుడు హైదరాబాద్‌లో నమోదైన క్రిమినల్ కేసుతో సహా అనేక కేసుల్లో నేరస్తుడిగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కాగా హైదరాబాద్‌లోనూ పలువురు నకిలీ డాక్టర్లు క్లినిక్‌లు పెట్టి గుట్టుచప్పుడు కాకుండా జనాల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఆధికారులు స్పందించి అన్ని క్లినిక్‌లపై దాడులు చేస్తేగానీ అసలు, నకిలీ డాక్టర్ల భాగోతం బయటపడదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.