AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరూ ఆ బీర్లు తాగారా?.. కాలంచెల్లిన మద్యం విక్రయం.. కస్టమర్లు ఏం చేశారంటే?

డబ్బు మోజులో పడిన కొందరు వ్యాపారులు వారి ఉత్పత్తులను కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే.. మరికొందరూ కాలం చెల్లిన ఉత్పత్తులను విక్రయిస్తూ జనాల పాలిట యముళ్లుగా మారుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే యానాంలో వెలుగు చూసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలు కాలంచెల్లిన మద్యం విక్రయిస్తున్నాయని కొందరు కస్టమర్లకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మీరూ ఆ బీర్లు తాగారా?.. కాలంచెల్లిన మద్యం విక్రయం.. కస్టమర్లు ఏం చేశారంటే?
Viral News
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Nov 10, 2025 | 4:59 PM

Share

కాలం చెల్లిన మద్యం విక్రయిస్తున్నట్టు ప్రభుత్వం మద్యం దుకాణాలపై ఆరోపణలు వచ్చిన ఘటన యానాంలో వెలుగు చూసింది. ఆయా దుకాణాలు కాలం చెల్లిన బీర్లను విక్రయించినట్టు గుర్తించిన కొందరు కస్టమర్లు.. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు ఆయా దుకారణాల్లో తనిఖీలు నిర్వహించారు. ​తాజాగా జరిగిన తనిఖీలలో, ఒక ప్రభుత్వ మద్యం షాపులో ఇప్పటికే నాలుగు కేసుల కాలం చెల్లిన బీర్లను వినియోగదారులకు విక్రయించినట్లు గుర్తించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు, రెవెన్యూ అధికారి సెంధిల్ కుమార్ షాపులో ఉన్న మరో మూడు కేసుల కాలం చెల్లిన బీర్లను స్వాధీనం చేసుకున్నారు.

​కాలం చెల్లిన మద్యం విక్రయంతో పాటు, యానాంలోని ప్రభుత్వ, ప్రైవేటు మద్యం షాపులలో అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ప్రతి సీసాపై అదనంగా పది రూపాయలు వసూలు చేస్తున్నారని మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుదుచ్చేరి ప్రభుత్వ దుకాణాల్లోనే ఇంత మొత్తంలో ఎక్స్పైరీ అయిన మందు అమ్ముతుంటే, ప్రైవేట్ షాపులలో ఇంకా ఎంత మద్యం నిల్వ ఉందో ఆ దేవుడికే ఎరుక అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటువంటి సంఘటనలు జరగడానికి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నిర్లక్ష్య ధోరణే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు ప్రతినెల మద్యం స్టాకు నిల్వ ఎంత ఉందో తనిఖీ చేయకుండా కాలయాపన చేయడం వల్లే వినియోగదారులు ప్రాణాలకు ప్రమాదకరమైన మద్యాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ​దీనిపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వ, ప్రైవేటు మద్యం దుకాణాలలో ఉన్న స్టాకును తనిఖీ చేయాలని, వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.