Family Mass Death: తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్! ఏం జరిగిందో..
తీర్థయాత్రలకు వెళ్లిన ఓ కుటుంబం మొత్తం అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడింది. సత్రం బస చేసేందుకు ఓ గది తీసుకుని.. అందులోనే నలుగురు కుటుంబ సభ్యులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో ఒక వృద్ధ మహిళ, ఆమె కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని నలంద జిల్లాలో శుక్రవారం (ఫిబ్రవరి 6) చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

నలంద, ఫిబ్రవరి 7: కర్ణాటకకు చెందిన ఒక కుటుంబం బౌద్ధులు, జైనులకు ప్రముఖ తీర్థయాత్ర కేంద్రమైన రాజ్‌గిర్‌ను సందర్శించారు. అక్కడి ధర్మశాలలో రూమ్ బుక్ చేసుకుని బస చేశారు. ఆర్. నాగ ప్రసాద్ పేరుతో బుక్ చేసిన ఆ గది 3 రోజులుగా తెరచుకోలేదు. పైగా ఆ గది నుంచి దుర్వాసన రావడంతో సత్రం నిర్వాహకులు శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని సత్రం గది తలుపు పగులగొట్టి లోనికి వెళ్లగా.. అక్కడి దృశ్యం చూసి చలించిపోయారు. ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి మొత్తం నలుగురు ఉరికి వేలాడుతూ కనిపించారు.
మృతులను ర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని గుబ్బికి చెందిన జిఆర్ సుమంగళ (78), ఆమె కుమార్తెలు శిల్ప జిఆర్ (48), శ్రుత జిబి (43), కుమారుడు జిఆర్ నాగ ప్రసాద్ (50)గా గుర్తించారు. మొబైల్ ఫోన్ల ద్వారా మృతులు కర్ణాటకలోని తుమకూరు జిల్లా గుబ్బి నివాసులుగా గ్రహించినట్లు రాజ్‌గిర్ డీఎస్పీ సునీల్ కుమార్ సింగ్ తెలిపారు. దీంతో ఆ రాష్ట్ర పోలీసులను సంప్రదించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మృతదేహాలను కిందకు దించే ముందు మేజిస్ట్రేట్ సమక్షంలో ఫోరెన్సిక్ నిపుణులు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తీసుకున్నారు.
అంతేకాకుండా మృతుల లగేజ్‌లో 25 స్ట్రిప్స్ నిద్రమాత్రలు ఉండటం గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎం కార్డులు, రూ. 1,18,000 నగదు, వ్యక్తిగత వస్తువులు కూడా వారి బ్యాగుల్లో ఉన్నాయి. నలుగురి మృతదేహాలను నలంద జిల్లాలోని బీహార్ షరీఫ్‌లోని సదర్ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసినట్లు నలంద ఎస్పీ చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




