AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీ సభ పేరు మార్పు.. ‘జనాగ్రహం’ తీసేయమన్న పీఎంవో.. అసలు కారణం ఇదే!

తెలంగాణ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే, ఈసారి ఆయన పర్యటనకు ముందే ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని పాల్గొనే బహిరంగ సభ పేరు విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడం, రాష్ట్ర బీజేపీ ప్రతిపాదించిన పేరును మార్చాలని ఆదేశించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ప్రధాని మోదీ సభ పేరు మార్పు.. ‘జనాగ్రహం’ తీసేయమన్న పీఎంవో.. అసలు కారణం ఇదే!
Pm Modi Telangana Tour
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: May 02, 2026 | 2:17 PM

Share

తెలంగాణ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే, ఈసారి ఆయన పర్యటనకు ముందే ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని పాల్గొనే బహిరంగ సభ పేరు విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడం, రాష్ట్ర బీజేపీ ప్రతిపాదించిన పేరును మార్చాలని ఆదేశించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తొలుత ఈ సభకు ‘జనాగ్రహ సభ’ అని పేరు పెట్టింది. సాధారణంగా ‘జనాగ్రహం’ అనే పదాన్ని రాజకీయ పోరాటాలు, నిరసనలు లేదా ప్రభుత్వ వ్యతిరేకతను వ్యక్తం చేసే సందర్భాల్లో వాడుతుంటారు. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలపై ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ బీజేపీ దేశవ్యాప్తంగా ఈ పేరుతో కార్యక్రమాలు చేపట్టింది.

అయితే, ఈసారి మోదీ పర్యటన కేవలం రాజకీయ సభకే పరిమితం కాలేదు. ఆయన హైదరాబాద్‌లో సుమారు 8 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఒక పక్క అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు, ‘ఆగ్రహం’ అనే ప్రతికూల అర్థం వచ్చే పేరుతో సభ నిర్వహించడం సముచితం కాదని ప్రధానమంత్రి కార్యాలయం అభిప్రాయపడింది. సానుకూల దృక్పథంతో, అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న తరుణంలో ఈ పేరు మార్పు తప్పనిసరి అయింది.

ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు రాష్ట్ర బీజేపీ తక్షణమే స్పందించింది. అప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో ‘జనాగ్రహ సభ’ పేరుతో పోస్టర్లు, సోషల్ మీడియా ప్రచార చిత్రాలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు వాటన్నింటినీ తొలగించి, కేవలం ‘ప్రధాని మోదీ బహిరంగ సభ’గా వ్యవహరించాలని నిర్ణయించారు. కార్యకర్తలు ఇప్పుడు పాత పోస్టర్లను సవరించే పనిలో నిమగ్నమయ్యారు.

ఇదిలావుంటే, మే 10వ తేదీన ప్రధాని మోదీ షెడ్యూల్ అత్యంత బిజీగా ఉండనుంది. మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణకు కేటాయించిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. సాయంత్రం 4:00 గంటలకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఈ సభకు సంబంధించి రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. బీజేపీ శ్రేణులు ప్రధాని ప్రసంగంపై ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే తెలంగాణపై భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సభ ద్వారా అటు అభివృద్ధిని, ఇటు రాజకీయ బలాన్ని చాటుకోవాలని బీజేపీ భావిస్తోంది. పరేడ్ గ్రౌండ్స్ సభకు భారీ ఎత్తున జనాన్ని సమీకరించి, దక్షిణ భారత్‌లో పార్టీ పట్టును నిరూపించుకోవాలని చూస్తోంది. పేరు మార్పు అనేది చిన్న పరిణామమే అయినప్పటికీ, అధికారిక పర్యటనల విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం ఎంత నిశితంగా వ్యవహరిస్తుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ప్రధాని ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేసిన సాయంపై స్పష్టమైన ప్రకటనలు ఉండవచ్చని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us