AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఈ పంటలు వేస్తే 75 శాతం సబ్సిడీతో విత్తనాలు!

రాష్ట్రంలోని రైతున్నలకు తెలంగాణ సర్కార్ కీలక సూచనలు చేసింది. ఎల్‌నీనో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గిపోయాయని.. ఈ క్రమంలో రైతులు ప్రత్యమ్నాయ పంటల సాగు చేయాలని సూచించింది. ప్రత్యామ్నాయ పంటలు పండించే రైతులకు 75 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని తెలిపింది. 

Telangana: రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఈ పంటలు వేస్తే 75 శాతం సబ్సిడీతో విత్తనాలు!
75 Percent Subsidy On Seed
Anand T
|

Updated on: Jul 31, 2026 | 8:24 AM

Share
రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు కొత్తగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ నుంచి ఎక్స్టెన్షన్ అధికారులను నియమించి, సంబంధిత విభాగాల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
గురువారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి  ఎల్ నినో పరిస్థితుల ప్రభావంపై నిపుణుల కమిటీ నివేదికను సమర్పించారు. నివేదికలో కమిటీ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసినట్టు పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల ప్రభావం, అత్యవసర కార్యాచరణ ప్రణాళికపై నివేదికలో ప్రస్తావించారు. రాష్ట్రంలో తగినంత వర్షపాతం నమోదు కాకపోవడంతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు.
ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. గ్రామాలవారీగా అత్యవసర ప్రణాళికలు రూపొందించి పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు, కూరగాయల పంటలను ప్రోత్సహించాలని తెలిపారు. 75శాతం సబ్సిడీతో ఈ పంటలకు సంబంధించిన విత్తనాలను అందించాలని, ప్రత్యామ్నాయ పంటలకు కొత్త రుణాలు మంజూరు చేయాలని కమిటీ సూచించింది.
గత ఏడాది ఈ సీజన్ లో 79.49 లక్షల ఎకరాలు సాగవగా, ఈ ఏడాది 74.56 లక్షల ఎకరాలు మాత్రమే సాగయ్యాయని పేర్కొన్నారు. పత్తి పంట 45 లక్షల ఎకరాలు, సోయాబీన్ 3.62 లక్షల ఎకరాలు, వరి 14.92 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన పంటల సాగు ఉందని నివేదికలో తెలిపారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో 75 నుంచి 90శాతం సబ్సిడీ అందించి డ్రిప్, స్ప్రింక్లర్ సాగు పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు.
పశుగ్రాస విత్తనాలుపై కూడా సబ్సిడీ అందించి.. పశు గ్రాస సాగును ప్రోత్సహించాలని, సాగునీటి కోసం నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాంకేతిక సూచనలు అందించాలని.. హైదరాబాద్ పరిసర గ్రామాల్లో కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ రైతు బజార్లకు రవాణా సౌకర్యం కల్పించాలని నివేదికలో పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో డైరీ యూనిట్లను స్థాపించేందుకు ఆర్థిక సహాయం అందించాలని, అత్యవసర చర్యల అమలును పర్యవేక్షించేందుకు గ్రామస్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, నిపుణుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Follow Us